వివాదమవుతున్న ఎంపీ అహ్మద్ మృతి

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ., మాజీ కేంద్ర మంత్రి ఇ.అహ్మద్ మరణంపై వివాదం రాజుకుంటోంది. గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూయడం.., ఆ తరవాత పార్లమెంటు సంప్రదాయాలకు భిన్నంగా లోక్‌సభను కొనసాగించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు తన తండ్రి అనారోగ్యంతో ఉన్నా.. కనీసం పరామర్శించేందుకు కూడా ఆర్ఎంఎల్. ఆస్పత్రి వైద్యులు అనుమతించకపోవడంపై ఆయన కుమారుడు అనుమానం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి ఆయన కుటుంబసభ్యులను అహ్మద్‌ని కలవనివ్వలేదని కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు ఆరోపించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులే ఆయన్ని కలవనివ్వకుండా కుటుంబీకుల్ని దూరంగా ఉంచారని పార్టీ వర్గాలు ఆరోపించాయి.
ఆస్పత్రి యాజమాన్యంతో గొడవ...
అంతకుముందు అహ్మద్ కుటుంబసభ్యులు ఆస్పత్రి యాజమాన్యంతో గొడవపడ్డారు. అహ్మద్ చనిపోయినట్లు ఆస్పత్రి ప్రకటించడానికి మూడు గంటల ముందే ఆస్పత్రికి వచ్చినా., ఆస్పత్రి వర్గాలు తన తండ్రిని చూడనివ్వలేదని, ఎందుకని ప్రశ్నించినా వారు సమాధానం ఇవ్వలేదని అహ్మద్ కుమారుడు ఆరోపించారు. కుమారుడిగా ఏ పరిస్థితిలో ఉన్నా తండ్రిని చూసే హక్కు తనకుందని, కానీ వాళ్లు తనను అనుమతించకపోవడంతో ఆవేదన చెందానని పేర్కొన్నారు. ఎంపీ అహ్మద్‌ని చూడనివ్వడంలేదని తెలియడంతో రాహుల్, సోనియా గాంధీ ఇతర కాంగ్రెస్ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకోవడంతో అప్పటికే ఆయన మరణించినట్లు ప్రకటన విడుదల చేశారు. ఇదంతా ప్రభుత్వం కావాలని చేసిన పనేనని కాంగ్రెస్ ఆరోపించింది. సభను కొనసాగించడంపై కూడా ఆ పార్టీ లోక్‌సభలో అభ్యంతరం వ్యక్తం చేసింది. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగం సమయంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వెనక సీట్లో కూర్చున్న అహ్మద్ ఉన్నట్టుండి స్పృహ తప్పిపడిపోయారు. అనంతరం ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించి రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన మరణించారు. బడ్జెట్ కోసం అహ్మద్ మరణాన్ని బీజేపీ దాచిపెట్టిందని వామపక్షాలతో పాటు, ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.
- Tags
- ఎంపీ అహ్మద్