వారి మధ్య పుండు పెట్టాలని డిగ్గీ కుట్ర

తెలుగు రాష్ట్రం విభజన సమయంలో విచ్చలవిడి నాటకాలు ఆడుతూ.... అటు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ వాళ్లు రాష్ట్రం కావాలని వెళుతున్నా, సీమాంధ్ర వాళ్లు సమైక్యంగా ఉంచాలంటూ కోరినా.. అందరినీ చాలా చులకనగా చూస్తూ చెలరేగిన అహంకారపూరిత నాయకుల్లో డిగ్గీ రాజా గా ప్రచారంలో ఉండే దిగ్విజయ సింగ్ కూడా ఒకరు. ఏతావతా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సమూలంగా సమాధి చేసి, తమమీద ఆధారపడినందుకు సోనియాకు గట్టి గుణపాఠమే చెప్పారు. ఇదంతా ఆయన నేపథ్యం అయితే.. తాజా పరిణామాల్లో ఇక్కడేదో పార్టీని మళ్లీ పునరుత్తేజితం చేసేయడానికి వచ్చినట్లుగా బిల్డప్ ఇస్తూ దిగ్విజయసింగ్ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య పుండు పెట్టేందుకు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
విభజనకు సంబంధించి నిర్ణయం తీసుకున్నందుకు గాను ఏపీలో ప్రజలు తమను తరిమి కొడతారనే భయం పూర్తిగా తీరిపోయాక ఢిల్లీ నాయకులు కూడా అప్పుడప్పుడూ ఇక్కడ పర్యటనలుచేస్తున్నారు. తాజాగా డిగ్గీరాజా కూడా అలాంటి పర్యటనే చేశాడు.
ఈ సందర్భంగా కాంగ్రెసులోని కాపునేతలు ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సభలో మాట్లాడుతూ.. ఏపీలో కష్టం పవన్ కల్యాణ్ ది అయితే .. ఫలితం చంద్రబాబు అనుభవిస్తున్నాడంటూ డిగ్గీ సెలవిచ్చారు. అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ ను పక్కన పెట్టారని చెప్పారు. చంద్రబాబునాయుడు కేవలం తన ఒక్కడి చరిష్మాతోనే అధికారంలోకి వచ్చాడనే అపోహ ఎవ్వరిలోనూ లేదు. అలాగని ఏకపక్షంగా పవన్ కల్యాణ్ ఒక్కటి పుణ్యమే అనుకోడానికి కూడా వీల్లేదు. మరి ఆ సమయంలో దేశవ్యాప్తంగా వీచిన మోదీ హవాను ఏమనుకోవాలి. దిగ్విజయ సింగ్ మరీ చవకబారుగా.. పురాతన కాలం నాటి రాజకీయ గిమ్మిక్కులను ప్రయోగిస్తూ ఈ డైలాగుతో చంద్రబాబు మీద కాపుల్లో ద్వేషబీజం నాటడానికి, పవన్లో అసంతృప్తి నాటడానికి ప్రయత్నిస్తే దెబ్బతింటారు. ఇలాంటి గిమ్మిక్కులు కాకుండా.. నిజాయితీగా ప్రజల పక్షాన తాము విభజన చట్టంలో ఇచ్చిన హామీల సాధనకు, ప్రత్యేక హోదా సాధనకు... ఏపీకి వచ్చినప్పుడు ముఖప్రీతి మాటలు కాకుండా.. ఢిల్లీలో సోనియాతోనే పోరాటం చేయిస్తే తప్ప ప్రయోజనం ఉండదని, తమ మాటలకు జనంలో విలువ కూడా ఉండదని తెలుసుకోవాలి.
అయితే దిగ్విజయసింగ్ తెలుసుకోవాల్సింది ఒకటుంది. ప్రజలు తనను ఏపీలో ఎక్కడా తరమడం లేదు గనుక, నిరసనలు గట్రా లేవు గనుక, పార్టీ పరిస్థితి చక్కబడ్డట్లే అని ఆయన అనుకోవచ్చు. కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీని జనం పట్టించుకోవడమే మానేశారని ఆయన తెలుసుకోవాలి. తన మాటకు విలువలేని చోట తాను ఏం చెప్పినా దాని పర్యవసానం ఏమీ ఉండదని గ్రహించాలి.