బెజవాడలో పనిచేయాలంలే ఉద్యోగులు భయపడిపోతున్నారు. తమ సర్వీసులో ఎక్కువ కాలం హైదరాబాద్ లో పనిచేసి ఇప్పడు బెజవాడలో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయిష్టంగా..నే పనులు చేసుకుపోతున్నారు. ఏపీ సచివాలయంలో పనిచేసే అధికశాతం మంది ఉద్యోగులది ఇదే వేదన. వారంలో ఐదు రోజులు అక్కడ ఉండాలంటేనే కష్టంగా ఉందంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం కాస్ట్ ఆఫ్ లివింగే. హైదరాబాద్ కంటే బెజవాడలో రేట్టు భగ్గుమంటున్నాయట. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకూ ఖర్చు చేస్తుంటే జేబులు ఖాళీ అవుతున్నాయన్నది ఉద్యోగుల మనో వేదన.
కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే...
సాధారణంగా హైదరాబాద్ కంటే విజయవాడలో ధరలు తక్కువగా ఉండాలి. కాని అలా లేదు. హైదరాబాద్ లో ప్లేట్ ఇడ్లీ పదిరూపాయలకు దొరికే హోటళ్లు అనేకం ఉన్నాయి. సంచార హోటళ్లు మధ్యతరగతి ప్రజలను, ఉద్యోగుల ఆకలి తీరుస్తున్నాయి. ఇక ఇంటి అద్దెలు భరించలేదని పరిస్థితి. సింగిల్ బెడ్ రూం ఇల్లు ఎనిమిది వేలకు తక్కువ ఉండటం లేదు. ఇద్దరు ఉద్యోగులు షేర్ చేసుకున్నా నెలకు నాలుగు వేలు సమర్పించుకోవాల్సిందే. దీంతో ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు.
వాతావరణమూ....
కాస్ట్ ఆఫ్ లివింగ్ తో పాటుగా వెదర్ కూడా వారికి సహకరించడం లేదట. కొన్నేళ్లుగా హైదరాబాద్ వాతావరణానికి అలవాటు పడిన ఉద్యోగులు ఇప్పడు బెజవాడ వెదర్ కండిషన్ కు తట్టుకోలేక పోతున్నారట. ఇక మార్చి వచ్చిందంటే ఎండలు అదిరిపోతాయి. బెజవాడ ఎండలంటే వేరే చెప్పక్కర్లేదు కదా.... అందుకే ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసి శని,ఆది వారాలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. మరో రోజు సెలవు కూడా పెడుతున్నారట. సీఎల్, ఈఎల్ లను ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఉద్యోగులు వాడేశారట. ఏపీ సచివాలయానికి తరలి వెళ్లిన ఉద్యోగులెవరూ ఫ్యామిలీని తీసుకెళ్లలేదు. ఫక్తు బ్యాచిలర్ లైఫే గడుపుతున్నారు. పిల్లల చదువు పూర్తయిన వారు కూడా బెజవాడలో స్థిరపడటానికి ఎవరూ మొగ్గుచూపటం లేదట. అందుకు కాస్ట్ ఆఫ్ లివింగ్...కారణమని బహిరంగంగానే చెబుతున్నారు.
కొసమెరుపు: ఉద్యోగులదాకా ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సీఎస్ టక్కర్ ఆరోగ్యం కూడా సహకరించడం లేదట. అందుకే ఆయన హైదరాబాద్ లోనే ఉండి పనిచేస్తానని సీఎంను రిక్వెస్ట్ చేసుకున్నారట. అందుకు సీఎం కూడా అంగీకరించారట. ముఖ్యమైన సమావేశాలకు మాత్రం హాజరవుతానని టక్కర్ చెప్పారని తెలిసింది.