వామ్మో...ఏటీఎంలో నకిలీ నోట్లా..?

ఆర్బీఐ కి నకిలీ గాళ్లు సవాల్ విసురుతున్నారు. ఏటీఎంలోనే నకిలీ రెండు వేల నోట్లు దర్శనమిస్తుండటంతో పోలీసులు అవాక్కయ్యారు. ఆర్బీఐ కూడా నిస్సహాయతను వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేస్తున్నామని ఆర్బీఐ ప్రకటించింది. ఢిల్లీలోని ఒక ఏటీఎంలో ఈ నకిలీ రెండు వేల రూపాయల నోట్లు వచ్చాయి. ఒక ఖాతాదారుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నగదును విత్ డ్రా చేశారు. మొత్తం ఎనిమిది వేలు విత్ డ్రా చేయగా నాలుగు రెండు వేల రూపాయల నోట్లు వచ్చాయి. అయితే ఈ నకిలీ నోటు మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన స్థానంలో మనోరంజన్ బ్యాంక్ అని ముద్రించి ఉంది.
ఆర్బీఐ గవర్నర్ సంతకం కూడా...
అలాగే సీరియల్ నెంబర్ ఏదీ లేదు. అన్నీ జీరోలో ఉన్నాయి. అసలు భారతీయ రూపీ గుర్తే లేదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం కూడా లేని నోట్లు ఏటిఎంలోకి ఎలా వచ్చిపడ్డాయో అని అధికారులు కూపీ లాగుతున్నారు. ఎప్పుడూ ఏటీఎంలలో నగదు పెట్టే ఏజెన్సీలే ఈ పనికి పాల్పడి ఉంటాయని అనుమానిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో...అదే ఏటీఎం నుంచి పోలీసులు కూడా నగదును డ్రా చేయగా నకిలీ నోట్లే రావడం గమనార్హం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో...ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేస్తు కొంచెం చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.