వందల కార్లు ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడంటే...

నెలవారీ జీతాలివ్వడమే కష్టం. అందులో ఉద్యోగులకు బోనస్ ఇస్తానంటే ఓహో అనుకుంటాం. కాని ఈ కంపెనీ యజమాని ఏకంగా తన ఉద్యోగులకు కార్లను బహుకరించారు. దాదాపు 1200 మంది ఉద్యోగులకు ఉచితంగా కార్లను ఇచ్చాడు ఈ ఫ్యాక్టరీ ఓనర్. గుజరాత్ కు చెందిన హరే కృష్ణ ఎక్స్ పోర్టర్స్ ఓనర్ సాన్జీభాయ్ ఢోలాకియా గత నాలుగేళ్లుగా ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా తన ఉద్యోగులకు కార్లను బహూకరిస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. ఈయన వజ్రాల వ్యాపారి.
ఈఎంఐలూ కంపెనీయే చెల్లించేలా......
ఉచితంగా కార్లు ఇచ్చారు సరే. దానికి పెట్రోలు ఎవరు పోయిస్తారంటే...ఉద్యోగులే పోయించుకోవాలంటున్నాడు ఢోలాకియా. తాను కేవలం కార్లను మాత్రమే ఇస్తానని వారు దానిని చక్కగా వాడుకుని కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడపాలన్న ఉద్దేశంతోనే ఇస్తున్నానన్నారు. అయితే ఢోలాకియా ఉచితంగా ఇచ్చిన కారు ఆన్ రోడ్ ధర 2.38 లక్షలు. కాని ఢోలాకియా పూర్తి సొమ్మును కంపెనీకి చెల్లించలేదు. కేవలం డౌన్ పేమెంట్ మాత్రమే చెల్లించారు. నెలసరి వాయిదాలను కూడా కంపెనీయే కడుతుందని చెబుతున్నాడు. కాని ఇక్కడో మెలిక పెట్టారు ఢోలాకియా. కార్లు ఉచితంగా పొందిన ఉద్యోగి రాజీనామా చేసి బయటకు వెళితే మాత్రం నెలసరి వాయిదా కట్టేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. సో.. ఈయనగారి టెక్నిక్ చూశారుగా... ఐదేళ్ల పాటు కార్లు తీసుకున్న ఉద్యోగి ఖచ్చితంగా అక్కడే పనిచేయాలి. వెళ్లాలంటే కారు ఈఎంఐలను కట్టుకోవాల్సిందే. అదండీ ఈ ఢోలాకియా గారి అసలు రహస్యం.
- Tags
- కార్లు బహుమతి