యూపీలో మేం అధికారంలోకి వస్తే....
ఉత్తరప్రదేశ్ లో కమలనాధులు పాగా వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ కి అత్యధిక స్థానాలు వస్తాయని ముందస్తు సర్వేలు వెల్లడించడంతో ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. యూపీలో అభ్యర్ధుల ఎంపిక నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. దీంతోపాటుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ యూపీలో ఎన్నికల మానిఫేస్టో విడుదల చేసింది. దీనికి ప్రత్యేకంగా ఒక పేరును కూడా పెట్టారు. మేనిఫేస్టోకు లోక్ కల్యాణ్ సంకల్ప పత్ర్ అని పేరు పెట్టారు. అయితే గతంలో సమాజ్ వాదీ ప్రకటించిన మేనిఫేస్టోలాగే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ల్యాప్ టాప్ లు వన్ జీబీతో ఫ్రీ....
బీజేపీ అధికారంలోకి వస్తే యువతకు ఒక జీబీ ఉచిత ఇంటర్నెట్ తో ల్యాప్ టాప్ లు ఇస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ల్యాప్ ట్యాప్ లు ఇస్తామని హామీ ఇచ్చి యువతకు కొంతమేర ఇచ్చింది. అదే హామీని ఇప్పుడు బీజేపీ కూడా ఇచ్చింది. ప్రతి యూనివర్సిటీలో ఉచిత వైఫై సదుపాయం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన పది యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామంది. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పింది. భారీగా ఉద్యోగాల కల్పన చేస్తామని ప్రకటించుకుంది. 12వ తరగతి వరకూ ఉచిత విద్యను అందిస్తామని మేనిఫేస్టోలో పేర్కొంది. అవినీతిని అరికట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. మొత్తం మీద కమలనాధుల మేనిఫేస్టో చూసి ఓటర్లు ఆకర్షితులవుతారా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.