మోదీకి సిగ్గేసింది : ఇన్వెస్టిగేట్ అనేశారంతే!!

నరేంద్ర మోదీ కాస్త సిగ్గు గాను, కాస్త అవమానంగానూ అనిపించినట్లుంది. రోజుకు నాలుగు జతల ఇస్త్రీ సూట్ లు మారుస్తూ.. తాను విదేశాల్లో పర్యటించి.. అటు పారిశ్రామిక వేత్తలు, ఇటు భారతీయ ఔత్సహిక యువ పారిశ్రామిక వేత్తలు అందరినీ కలుస్తూ.. వారికి స్వాగతం పలుకుతూ.. భారత్ కు వచ్చి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావాల్సిన సకల వసతులూ కల్పించేస్తాం.. అని పెద్ద స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంటే.. ప్రపంచస్థాయిలో వచ్చిన నివేదికలో మన దేశానికి దక్కిన స్థానం చూసుకుని ఆయన షాక్ తిన్నట్లుగా కనిపిస్తున్నారు. ప్రపంచంలో మొత్తం 190 దేశాలు ఉంటే.. మన దేశానికి 130 వ ర్యాంకు రావడం అనేది ఏ ప్రాతిపదిక మీదనైనా సరే చాలా అవమానకరమైన సంగతి.
అలాంటిది సులువుగా వ్యాపారం చేసుకోదగిన దేశాల జాబితా అంటూ ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన దానిలో భారత్ 130 వ ర్యాంక్ లో ఉండడం అనేది ఎవరినైనా కలవరపరిచే అంశమే. విదేశీ పెట్టుబడులకు మమ్మల్ని మించిన దేశం లేదని మన దేశాధినేతలు ప్రపంచమంతా టముకు వేయడమే తప్ప.. వాస్తవం అందుకు భిన్నంగా ఉందా అనే భయం కలుగుతోంది.
అయితే ప్రపంచ బ్యాంకు నివేదికలో ఇంత ఘోరమైన ర్యాంకు రావడం పట్ల మోదీ చాలా సీరియస్ అయ్యారుట. నెలలోగా ఇలాంటి ఘోరమైన ర్యాంకు రావడం ఎలా జరిగిందో తనకు నివేదిక ఇవ్వాలని ఓ కేబినెట్ కార్యదర్శిని పురమాయించారుట. గత ఏడాది ఇదే జాబితాలో మన దేశానికి 131 వ స్థానం ఉండేది. ఇప్పుడు 130 కు ఎగబాకాం. అయితే టాప్ 50 లో మన దేశం ఉండేలా కృషి జరగాలని మోదీ అంటూనే ఉంటారు తప్ప.. అందుకు జరుగుతున్న నిర్దిష్టమైన ప్రయత్నం ఏంటో మనకు తెలియదు.