మరోసారి పవన్ పై వెంకయ్య ఘాటు విమర్శలు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో రావాలని ఉంటే నేరుగా రావాలని...నినాదాలిచ్చి ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని పవన్ పై వెంకయ్య తాజాగా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయనవసరం లేదన్న వెంకయ్య...అంతకు మించి ప్రయోజనాలు వచ్చే ప్యాకేజీని ఇచ్చామన్నారు. భారత దేశమంతటా ఒక్కటేనని, ఉత్తరాది...దక్షిణాది అంటూ ప్రజల్లో ఐకమత్యాన్ని చెడగొట్టద్దని పరోక్షంగా పవన్ కు హితవు చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీయే కాని,ఉత్తరాది పార్టీ కాదన్నది విమర్శలు చేసేవారు గుర్తెరగాలన్నారు.
వెంకయ్యనాయుడు పై జనసేనాని అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. వెంకయ్య స్వర్ణభారతి ట్రస్ట్ పై పెట్టిన మనస్సు ప్రత్యేక హోదాపై పెట్టి ఉంటే అది వచ్చి ఉండేదని పవన్ ధ్వజమెత్తారు. వెంకయ్య ఏమైనా దేవుడా? అని కూడా ప్రశ్నించారు. దీనికి బీజేపీ వర్గాల నుంచి తీవ్రంగానే విమర్శలు వెల్లువెత్తాయి. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏం చేశారో చెప్పాలని పవన్ ను బీజేపీ యువమోర్చా ప్రశ్నించింది. వెంకయ్య నాయుడు మాత్రం పవన్ ప్రశ్నలకు ప్రతిరోజూ సమాధానమిస్తూనే ఉన్నారు.