మంత్రులపై బాబు ఫైర్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి రావెల కిషోర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని...ఇలా అయితే...చిన్నైనా..పెద్దైనా సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో మంత్రి రావెలకు, జడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్ వర్గాల మధ్య విభేదాలు రోడ్డు కెక్కిన సంగతి తెలిసిందే. దీనిపై త్రిసభ్య కమిటీని కూడా బాబు నియమించారు. కమిటీ నివేదిక ఇచ్చారో..లేదో తెలియదు కాని చంద్రబాబు మాత్రం రావెల పై నిప్పులు చెరిగినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు పార్టీలో చేరి మంత్రి పదవిని పొంది ఇలా జిల్లాలో వర్గాలు సృష్టించుకుంటే ఎలా అని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. పార్టీ ప్రతిష్టను బజారు కీడుస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి రావెలపై జానీమూన్ వర్గమే కాదు ఇటీవల పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేతలు,కార్యకర్తలు కూడా చినబాబు లోకేష్ కు ఫిర్యాదు చేశారు. అయితే రావెల మాత్రం తన తప్పేమీ లేదని చంద్రబాబు వద్ద చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఈ సంఘటన పార్టీ సమన్వయ సమావేశంలో జరిగిందని చెబుతున్నారు. ఈ సమావేశంలో రావెలపై ముఖ్యమంత్రి బాగానే అక్షింతలు వేశారని చెబుతున్నారు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా చంద్రబాబు ఫైర్ అయినట్లు సమాచారం. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. మంత్రిగా ఉండి మీరేం చేస్తున్నారని అచ్చెన్నాయుడుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
- Tags
- చంద్రబాబు