భాజపా ఆపరేషన్ ఏపీ : బరిలోకి మోదీ, అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విలక్షణమైన వ్యూహాన్నిఅనుసరిస్తోంది. ఒకవైపు రాష్ట్రానికి అద్భుతమైన నాయకుడు అని, ఆయన పాలనలో రాష్ట్రం ముందుకు వెళుతుంది అంటూ చంద్రబాబునాయుడును కీర్తిస్తూనే మరోవైపు భాజపాను విస్తరించడానికి వ్యూహరచన చేస్తోంది. బహుశా ఆంధ్రప్రదేశ్ లో తాము రెండోస్థానంలో ఉండే పార్టీగా ఎదగాలని వారికి కోరిక ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం జనాకర్షణ గల తమ పార్టీ అగ్రనేతలను ప్రత్యేకంగా రాష్ట్రానికి పిలిపించి, రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తోంది.
మోదీ, అమిత్ షా ల సారథ్యంలో రెండు సభలు నిర్వహించాలనేది భాజపా తాజా నిర్ణయం. విజయవాడలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు సిద్ధార్థ ఈ సూచన చేశారు. ఆ మేరకు నవంబరు 26న పశ్చిమగోదావరి జిల్లాలోను, జనవరి మొదటి వారంలో తిరుపతిలోను బహిరంగ సభలు ఉంటాయి. వెస్ట్ గోదావరిలో రైతు సంక్షేమ సభ పేరుతో నిర్వహించబోతున్నారు. ఈ సభకు అమిత్ షా, తిరుపతి సభకు ప్రధాని మోదీ హాజరవుతారు.
కొత్తగా ఏం చెప్తారన్నదే ప్రధానం
రాష్ట్రంలో పార్టీని విస్తరించాలని అనుకుంటే గనుక రాష్ట ప్రజలకు ఉపయోగపడేలా కొత్తగా ఈ అగ్రనేతలు ఏం చెబుతారనేది చాలా ముఖ్యం. అంతే తప్ప.. రాష్ట్రానికి మేం వచ్చే అయిదేళ్లలో 2.03 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మీ రాష్ట్రంలో ఏ చిన్న పని జరిగినా అది మా నిధులతోనే జరుగుతోంది.. అన్ని కేంద్ర యూనివర్సిటీలు ఇచ్చాం.. కేంద్ర సంస్థలు ఇచ్చాం.. అంటూ అరిగిపోయిన రికార్డులు వేయడం వలన వారు సాధించేది ఏమీ ఉండదు. అదే తరహాలో.. మన్ కీ బాత్ ప్రసంగాల్లో చెప్పేలాగా స్వచ్ఛ భారత్ గురించి, సైనికుల గొప్పదనం గురించి, సర్దార్ పటేల్ గురించి.. అలవాటైపోయిన ప్రసంగాలను ఇక్కడి ప్రజలకు వినిపించినా ఉపయోగం లేదు. ప్రధాని వచ్చారు.. వెళ్లారు అన్నట్లుగా కాకుండా, ‘ఇక్కడి’ సామాన్యుడికి ఆయన ఏం తెచ్చారు అనేది తేలిస్తేనే ‘ఇక్కడ’ పార్టీ బలపడడం కుదురుతుంది.
ప్రజల మనసులో ఉన్న కోరికలను పట్టించుకోకుండా తమ బుద్ధికి తోచినట్లు చేసుకుంటూ పోతే.. అధికారంలో ఉన్నారు గనుక, సభలు నిర్వహించగలరు గానీ.. ప్రజల ఆదరణను చూరగొనలేరు.
ఈ కసరత్తు జరిగేలోగా మిత్రపక్షమైన తెలుగుదేశంలో వీరిపట్ల అపనమ్మకం ఏర్పడే స్థాయి వరకు పరిస్థతి వచ్చిందంటే గనుక.. సాంతం కొత్త సమీకరణాలు తయారవుతాయి.