బ్యాంకు అధికారులపై వేటు పడింది...

పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకు అధికారులు అవినీతికి పాల్పడినట్లు రుజువైంది. పెద్ద నోట్లు రద్దు తర్వాత బ్యాంకింగ్ రంగంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తేలింది. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అనేక బ్యాంక్ లకు చెందిన 156 మంది సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని లోక్ సభలో ప్రభుత్వం ప్రకటించింది.
156 మంది సస్పెన్షన్....
పెద్దనోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తుందని, నల్లకుబేరులకు కళ్లెం వేయొచ్చని ప్రభుత్వం భావించింది. అయితే కొందరు బ్యాంకు అధికారులు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చారు. సీనియర్ అధికారులను 156 మందిని సస్పెండ్ చేయడమే కాకుండా 41 మందిపై బదిలీ వేటు వేశామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రయివేటు రంగ బ్యాంకులకు సంబంధించి 11 మందిని సస్పెండ్ చేశామన్నారు. నోట్ల రద్దు తర్వాత క్రిమినల్ వ్యవహారాలకు సంబంధించి 126 కేసులు నమోదయ్యాయని జైట్లీ తెలిపారు. బ్యాంకుల్లో నేటికీ ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుందని, నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చ్యర్యలు తీసుకోనున్నారు.