బంగారం లావాదేవీల మీద డేగ కన్ను

పెద్దనోట్ల నిషేధం జరిగింది.. నల్లధనం దాచుకుని ఉన్నవాళ్లంతా అప్రమత్తం అయి.. తమ డబ్బు మార్చుకునే ప్రయత్నాలు మొదలెడతారు అని మోదీ ప్రకటన వెంటనే జనం అనుకున్నారు. ఆ రోజునుంచే నల్ల కుబేరుల ప్రయత్నాల ఆట కట్టించడానికి ఆదాయపు పన్ను అధికారులు కూడా వెంటనే రంగంలోకి దిగుతారని కూడా అంచనాలు వేశారు. అయితే తమాషాగా రెండు రోజుల పాటూ ఐటీ అధికారులు వ్యాపకం ఏమీ కనిపించనేలేదు. మూడో రోజు అయిన శుక్రవారం ఐటీ దాడులు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తూ బాహుబలి చిత్ర నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఏకకాలంలో దాడులు చేసి 50 కోట్ల రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 67 మంది ఫారెక్స్ డీలర్ల మీద ఐటీ దాడులు జరిగాయి. చెన్నయ్ లో 8 మంది హవాలా వ్యాపారుల మీద 70 మంది ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఏమేరకు సొమ్ము స్వాధీనం చేసుకున్నారనే వివరాలు బయటకు రాలేదు. బంగారం దుకాణాల్లో జరిగిన లావాదేవీల మీద ఐటీ అధికారులు డేగకన్ను వేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా బంగారం దుకాణాల్లో జరిగిన లావాదేవీలు మొత్తం బయటకు తీస్తున్నట్లు తెలుస్తోంది.
చూడబోతే ఐటీ అధికారులు చాలా వ్యూహాత్మకంగా తొలి రెండు రోజులు మౌనం పాటించి.. ఇప్పుడు బంగారం దుకాణాల్లో ఈ రెండు రోజుల పాటూ జరిగిన లావాదేవీల మీద ఒక్కసారిగా దృష్టి సారించారు. ఈ రెండురోజుల్లో చాలా మంది నల్లకుబేరులు విచ్చలవిడిగా బంగారం కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. హైదరాబాదు నగరంలో ఒక్క రోజులోనే 300 కోట్ల రూపాయల విలువైన బంగారం వ్యాపారం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అనూహ్యమైన అధికధరలకు కూడా బంగారాన్ని కొనేసినట్లు తెలుస్తోంది. ఇలా కొన్న వారి వివరాలను ఐటీ అధికారులు బంగారం దుకాణాల ద్వారా సేకరించి.. ఐటీ దాడులు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం.
రెండు రోజుల మౌనం ద్వారా నల్లకుబేరులు చెలరేగేలా అవకాశం ఇచ్చి, వారు కొనుగోళ్లు చేసిన బంగారం దుకాణాల ద్వారా లీడ్ లు సంపాదించి దాడులకు ఐటీ అధికారులు సన్నద్ధమవడం చూస్తోంటే అంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నట్లు అనిపిస్తోంది.