ఫ్లైటెక్కుతున్నారా? అయితే ఇది గమనించండి

అతని అమాయకత్వం జైలు పాల్జేసింది. నమ్మిన వ్యక్తే నట్టేట ముంచాడు. విదేశాలకు వెళ్లే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటనతో స్పష్టమవుతోంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిని డ్రగ్స్ మాఫియా వలలో పడేసుకుంటుంది. ఇందుకు నిజామాబాద్ కు చెందిన శ్రీనివాస్ ఉదాహరణ. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడపాకల్ కు చెందిన శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఆరేళ్లు దుబాయ్ లో పనిచేసి కాస్తో కోస్తో కాసులు వెనకేసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకుందామని గత ఏడాది సొంత ఊరికి వచ్చాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. పెళ్లయ్యాక మళ్లీ దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు శ్రీనివాస్. రెండేళ్లు ఉండివస్తానని చెప్పి బయలదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు.
తెలిసిన వారి పేరుతో మోసం...
దుబాయ్ కి బయలుదేరే రెండు రోజుల ముందు శ్రీనివాస్ లేని సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఒక బ్యాగ్ ఇచ్చారు. ఇందులో మందులున్నాయని, దుబాయ్ లో తెలిసిన వ్యక్తులు వచ్చి తీసుకుంటారని చెప్పాడు. శ్రీనివాస్ భార్య అమాయకంగా నమ్మేసి ఆ బ్యాగ్ ను తీసుకుంది. శ్రీనివాస్ బయలుదేరే సమయంలో తెలిసిన వారిచ్చారని భార్య చెప్పటంతో నమ్మేశాడు. బ్యాగ్ ను తీసుకుని దుబాయ్ బయలుదేరి వెళ్లాడు. అయితే దుబాయ్ లో బ్యాగ్ ను తనీఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. అందులో డగ్ర్స్ ఉన్నట్లు గమనించారు. శ్రీనివాస్ ను దుబాయ్ లో అరెస్ట్ చేశారు. తనకు తెలియదని, తెలిసిన వాళ్లు ఇచ్చిన బ్యాగ్ నే తాను తీసుకొచ్చానని చెబుతున్నా పోలీసులు విన్పించుకోలేదు. ఇక్కడ శ్రీనివాస్ భార్య బ్యాగ్ ఇచ్చిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఏమీ తెలియకుండానే అమాయకత్వం కారణంగా డ్రగ్స్ ఊబిలో చిక్కుకున్నాడు శ్రీనివాస్. సో...విదేశాలకు వెళ్లే ఎవరైనా...ఎవరో వ్యక్తులు ఇచ్చిన బ్యాగ్ లను విదేశాలకు తీసుకెళ్లారో మీ పని అంతే. పాపం ప్రస్తుతం శ్రీనివాస్ తాను చేయని తప్పుకు దుబాయ్ జైల్లో మగ్గిపోతున్నాడు.
- Tags
- విదేశాల మోసం