పార్లమెంటులో టీడీపీ వ్యూహమిదే...

పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పట్టుబడుతూనే, ప్యాకేజీకి చట్ట బద్ధత తెచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం రెండు విడతల టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తొలుత గుంటూరులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రులు సమావేశమయ్యారు.
15 రోజుల్లో ప్యాకేజీకి చట్టబద్ధత....
పార్లమెంటులో వైసీపీ సభ్యులను దీటుగా ఎదుర్కోవాలని సభ్యులకు లోకేష్ సూచించారు. వైసీపీ సభ్యులు ప్రత్యేక హోదా కోసం పట్టుబడతారని, అదే సమయంలో ప్యాకేజీ వల్ల ప్రయోజనాలను టీడీపీ సభ్యులు వివరించాలని కోరారు. చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్, విభజన చట్టంలో అమలు కాని అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిశ్చయించారు. ఇందుకోసం ఎంపీలందరూ సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు కోరారు. ఎప్పటికప్పుడు అందరూ టచ్ లో ఉంటూ ప్రతి అంశంపైనా స్పష్టతతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. తర్వాత మీడియాతో కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధతను 15 రోజుల్లో తీసుకొస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇక ముగిసిన అంశమేనన్న చౌదరి రాష్ట్రానికి నిధులు తేవడంపైనే తమ దృష్టి ఉంటుందన్నారు.
- Tags
- టీడీపీపీ సమావేశం