పార్ధీ గ్యాంగ్ వచ్చింది...పారాహుహార్....

పార్ధీ గ్యాంగ్ కిలోల కొద్దీ పసిడిని దోచుకెళ్లింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్ నుంచి దొంగలు 46 కిలోల బంగారాన్ని కొల్లగొట్టారు. ఈరోజు ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం తలుపులు తెరచుకున్న కొద్దిసేపటికే నలుగురు వ్యక్తులు లోపలికి వచ్చారు. వారు తమను సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. లాకర్లను తెరవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. అక్రమ బంగారం నిల్వ ఉంచినట్లు తమకు సమాచారం అందిందని..తనిఖీలు చేయాలని కోరడంతో సిబ్బంది లాకర్లను తెరవడంతో అందులో ఉన్న బంగారం మొత్తాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న సిబ్బందిని తుపాకీలతో బెదిరించారు. సిబ్బంది అందరినీ బాత్ రూమ్ లో బంధించి సీసీ కెమెరాలను, హార్డ్ డిస్క్ లను తీసుకుని దొంగలు కారులో పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. వీరి కారు హైదరాబాద్ వైపు వెళ్లడం చూశామంటున్నారు. సిబ్బంది తేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగలు హిందీలో మాట్లాడుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ముత్తూట్ నుంచి దోపిడీకి గురైన బంగారం విలువ రూ.12 కోట్ల రూపాయల విలువుంటుందని చెబుతున్నారు. దోపిడీ ముఠా బీహార్ కు చెందిన పార్ధీ గ్యాంగ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక సరిహద్దులను పోలీసులు అలెర్ట్ చేశారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం దోపిడీకి గురైందని తెలుసుకున్న ఖాతాదారులు అక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.