పవన్ పై వార్ కు తెలుగు తమ్ముళ్లు రెడీ
జనసేన, టీడీపీ మధ్య గ్యాప్ బాగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలు రెండు కలసి పోటీ చేసే అవకాశాలే లేవు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. కేంద్రంలో బీజేపీకి, ఏపీలో టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. దక్షత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని పవన్ అనేక సభల్లో కొనియాడారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు కూడా. అయితే టీడీపీ అధికారంలోకి రావడానికి, బీజేపీ ఎమ్మెల్యేలు ఏపీలో గెలవడానికి పవన్ ప్రచారమే కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. ఒక సామాజిక వర్గం ఓటర్లను పవన్ ప్రభావితం చేయడంతోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందన్న విశ్లేషణలూ విన్పించాయి. చంద్రబాబు తాము అధికారంలోకి రావడానికి పవన్ ప్రచారం ప్లస్ అయిందని కూడా చెప్పడం విశేషం.
పవన్ సూటి ప్రశ్నలకు సమాధానాలేవీ?
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ రెండు,మూడు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ప్రజాసమస్యలను గురించి వివరించారు. ఇద్దరి మధ్య సయోధ్య ఉందనే అందరూ భావించారు. అయితే రానురాను ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. అందుకు ప్రధాన కారణం ప్రత్యేక హోదానే. ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ తొలినుంచి పట్టుబడుతున్నారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నది పవన్ విశ్వసిస్తున్నారు. అలాంటి ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని జనసేన అధినేత బలంగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తే.....బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా నట్టేట ముంచిందని పవన్ తన సన్నిహితుల వద్ద అంటూనే వస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడాన్ని పవన్ పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. దీనికితోడుగా తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవడం నచ్చలేదు. టీడీపీ హోదా కోసం కనీస ప్రయత్నం చేయకుండా....వచ్చింది చాలులే...అన్నట్లు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఎందుకు ఆధారపడాల్సి వస్తోందని పవన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నాటి నుంచే జనసేన అధినేత టీడీపీ పై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు. వరుసగా ప్రజాసమస్యలపై వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులు, పోలవరం రైతులు, రాజధానికి భూములిచ్చిన రైతులు, పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్స్ బాధితులు, చేనేత కార్మికులు ఇలా ఒక్కటేమిటి? వచ్చిన వారి సమస్యలను ఓపిగ్గా వింటూ వారికి భరోసానిస్తున్నారు పవన్. వారికి అనుకూలంగా...ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తూ వస్తున్నారు. అయితే పవన్ లేవనెత్తుతున్న ప్రజాసమస్యలపై ప్రభుత్వం కొంత స్పందిస్తూనే వస్తోంది. ఉద్దానం సమస్యపై తక్షణం స్పందించింది.
పవన్ పై చంద్రబాబు అసహనం....
ప్రజాసమస్యలపై స్పందించే పవన్ కల్యాణ్ పట్ల తెలుగుదేశం పార్టీ కూడా చూసీ చూడనట్లు ఊరుకుంది. మంత్రులు కూడా పవన్ చేసిన సూచనలు తాము స్వీకరిస్తామనే ఇప్పటి వరకూ చెప్పుకొచ్చారు. కాని పవన్ ఎప్పుడైతే ప్రత్యేక హోదాపై గళం విప్పడం మొదలుపెట్టారో...అప్పటి నుంచి టీడీపీ నేతల టోన్ కూడా మారింది. ఇప్పటికే పవన్ తిరుపతి, అనంతపురం, కాకినాడ బహిరంగ సభలు పెట్టి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మోడీని,కేంద్రమంత్రి వెంకయ్యనాయుడినే టార్గెట్ చేసుకునే పవన్ ప్రసంగాలు కొనసాగాయి. అప్పుడు కూడా టీడీపీ నేతలు మౌనంగానే ఉన్నారు. తాజాగా విశాఖ ఆర్కే బీచ్ లో విద్యార్ధులు తలపెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి పవన్ మద్దతు ప్రకటించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. పైగా పవన్ విశాఖలో ఆరోజు కాగడాల ప్రదర్శన చేయాలని యువతకు పిలుపునివ్వడం టీడీపీ ఆగ్రహం తెప్పించింది. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో పవన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాజకీయ అనుభవ లేమితో మాట్లాడుతున్నారని పరోక్షంగా పవన్ పై విమర్శల దాడిచేశారు ముఖ్యమంత్రి. దీంతో ఇక మంత్రులు కూడా పవన్ పై మాటల దాడి స్టార్ట్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని తెలుసుకోకుండా పవన్ అవగాహనలేమితో మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు గొంతు విప్పారు. ప్రత్యేక హదాకు, జల్లికట్టు ఉద్యమానికి పోలికే లేదని తెలుగు దేశం అగ్రనేతలు వాయిస్ పెంచేశారు. ఎంపీ రాయపాటి, మంత్రులు అయ్యన్న పాత్రుడు కూడా పవన్ వైఖరిని తప్పుపడుతూ మాట్లాడారు. ప్రత్యేక హోదాపై పవన్ ఢిల్లీ వెళ్లి పోరాటం చేయాలన్నారు. పవన్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఊరుకుంటే తమ పార్టీకే ప్రమాదమని భావించిన టీడీపీ నేతలు ఇక పవన్ ను ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. జనసేనను ప్రత్యర్ధి రాజకీయపార్టీగానే చూడాలని నిశ్చయించారు. దీంతో చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మధ్య ఇక పోరు మాత్రమే ఉంటుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.