పవన్ కళ్యాణ్ ఉద్యమం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదట

పవర్స్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు చేసిన విస్తృత ప్రచారం రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో రావటానికి, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులకు అత్యధిక ఓట్లు పడటానికి ప్రధాన కారణమని ఇప్పుడు తెలుగు దేశం మరియు భారతీయ జనతా పార్టీ నేతలు విస్మరిస్తే విస్మరించొచ్చు కానీ ఇది మాత్రం వాస్తవం. ఈ వాస్తవాన్ని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక శాతం మంది ప్రజలు కూడా గుర్తించారు అనేది కూడా వాస్తవం. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయమై ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతని తమకి అనుకూలంగా మలచుకోవటానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ ప్రజల దృష్టి ఆ పార్టీ పై ఎంత ఉందొ జనసేన పార్టీ వ్యూహం పై కూడా అంతే వుంది. ఈ క్రమంలో 2019 ఎన్నికలకి తెలుగు దేశం తో పొత్తు కి పోకుండా సొంతగా పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వెళ్తారని ఇప్పటికే స్పష్టత వచేయటంతో అధికార పార్టీ ప్రతినిధులు జగన్ నిరసనలను ఎలా అయితే విమర్శిస్తున్నారో పవన్ కళ్యాణ్ తలపెడుతున్న ఉద్యమాలను కూడా అదే స్థాయిలో విమర్శిస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ కి చెందిన హిందుపూర్ లోకసభ సభ్యుడు నిమ్మల క్రిష్టప్ప గుంటూరు లో చేనేత కార్మికుల తో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. "మా ప్రభుత్వం చేనేత కార్మికులకు నిరంతరం చేయూతనిస్తూనే వుంది. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చి చేనేత కార్మికుల కష్టాలు తీర్చటానికి అని చేనేత దుస్తులకు ప్రచారకర్తగా వ్యవహరించినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదు. అలానే ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమం తలపెట్టనున్నామని ప్రజలని తప్పు దోవ పట్టిస్తున్నారు జగన్ మరియు పవన్ కళ్యాణ్ లు. కేంద్రం నుంచి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఉపయోగపడే హోదా కి పూర్తిగా సమానమైన ప్యాకెజీ తీసుకువచ్చి రాష్ట్రాభివృద్ధి పైనే తన దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించి పని చేస్తున్నారు చంద్ర బాబు నాయుడు. అటువంటి సమర్ధవంతమైన ముఖ్యమంత్రి కి సహకరించాల్సింది పోయి ఉద్యమాలు చేయటానికి సిద్దపడుతున్నారు. వీరు చేపట్టే ఉద్యమం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం అయితే ఏది లేదు." అంటూ జగన్ తో పాటు పవన్ కళ్యాణ్ ని ప్రతిపక్షంగానే అభివర్ణిస్తూ పై వ్యాఖ్యలు చేశారు నిమ్మల క్రిష్టప్ప.
- Tags
- పవన్ కళ్యాణ్