నిరుద్యోగ ర్యాలీని ఆదివారం జరుపుకోవాలన్న కోర్టు

హైదరాబాద్ లో టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీని ఆదివారం నిర్వహించుకోవాలని న్యాయస్థానం సూచించింది. ప్రొఫెసర్ కోదండరామ్ పిటీషన్ పై ఈరోజు విచారించిన హైకోర్టు ర్యాలీని 22న కాకుండా ఆదివారం నిర్వహించుకోవాలని కోరింది. నిరుద్యోగ ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదముందని, మరో జల్లికట్టు తరహా ఆందోళన జరిగే అవకాశముందని హైకోర్టుకు హైదరాబాద్ పోలీసులు వివరించిన సంగతి తెలిసిందే. పోలీసు అధికారులు కూడా ఇందిరాపార్క్ వద్ద కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాలను కూడా కోదండరామ్ కు సూచించారు.
అయితే కోదండరామ్ మాత్రం పుచ్చలపల్లి సుందరయ్య భవన్ నుంచి ఇందిరాపార్క్ వరకూ ర్యాలీని నిర్వహించి అక్కడ సభ జరుపుకుంటామని చెప్పడంతో పోలీసులు అంగీకరించలేదు. పోలీసులు కూడా ఆదివారం ఇక్కడే జరుపుకోమని తెలిపారు. ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశముందని కూడా పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకునే తాము నిరుద్యోగ ర్యాలీకి అనుమతివ్వలేదని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. అయితే దీనిపై జేఏసీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందన్నారు ప్రొఫెసర్ కోదండరామ్.
- Tags
- నిరుద్యోగ ర్యాలీ