నల్లధనం,అవినీతి తగ్గింది : రాష్ట్రపతి

దేశంలో నల్లధనం, అవినీతి గణనీయంగా తగ్గిందని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. అవినీతిని,నల్ల ధనాన్ని నియంత్రించేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామని రాష్ట్రపతి అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. బినామీ ఆస్తుల చట్టంలో సవరణలను తెచ్చామన్న ప్రణబ్ దేశంలో ఆధార్ ద్వారానే చెల్లింపుల ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రపతి చెప్పారు. దేశ సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రయిక్స్ ను విజయవంతంగా నిర్వహించామని రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రజాసంక్షేమం కోసం....
ప్రజా సంక్షేమంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బేటీ బచావో...బేటీ పడావో పథకం ద్వారా బాలికలకు రక్షణ కల్పించామన్న ప్రణబ్ దీన్ దయాళ్ గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇందుకోసం స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకొచ్చిందన్నారు. పదివేల కోట్ల రూపాయలతో నేషనల్ అప్రెంటిస్ పథకాన్ని ప్రారంభించనట్లు ఆయన ఉభయ సభలకూ తెలియజేశారు. ఒక్క పిలుపుతో దేశ వ్యాప్తంగా కోటి ఇరవై లక్షల మంది గ్యాస్ సబ్సిడీని వదులుకోవడం అభినందనీయమన్నారు రాష్ట్రపతి. వనబంధు కల్యాణ యోజన పథకం ద్వారా 300 గిరిజన జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం పాటు పడిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం 47 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు పనులు కల్పించడం జరిగిందని వివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవాలు పెరిగాయన్నారు.