Sun Nov 10 2024 12:28:36 GMT+0000 (Coordinated Universal Time)
నయీమ్ విషయం లో కె.సి.ఆర్ మాటలు చేతలయ్యేనా?
నిన్న తెలంగాణ అసెంబ్లీ లో నయీమ్ కేసు విచారణ పై జరిగిన చర్చ దాదాపు ఏకపక్షంగా, ముఖ్యమంత్రి దే పై చేయి గా జరిగింది. ఈ రోజు అస్సెంబ్లీ లో ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తూ, ఈ సంఘటన రాష్ట్ర శాంతి భద్రతల పై ప్రభావం చూపిందని ఆన్నారు. సభలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం వాదనలు బలహీనంగా ఉన్నాయి. దీనికి కారణం వారి ప్రభుత్వ హయాంల్లోనే నయీమ్ అక్రమాలు యథేఛ్ఛగా జరగడం మరియు అప్పట్లో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు నయీమ్ తో కుమ్మక్కైయ్యారని వార్తలు రావడం. కాంగ్రెస్ తరపున T.జీవన్ రెడ్డి మాట్లాడుతూ, నయీమ్ ని పట్టుకోవడంలో ప్రభుత్వ అలసత్వాన్నిప్రశ్నించారు. కె.సి.ఆర్ స్పందిస్తూ, పాత కాంగ్రెస్ ప్రభుత్వమే నయీమ్ ని పెంచి పోషించిదని, వారు పదేళ్ళలో చేయలేని పనిని తాము రెండు సంవత్సరాలలో చేశామని చెప్పరు. ఈ సందర్భంగా కె.సి.ఆర్ నయీమ్ ని సజీవంగా పట్టుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఈ సంవత్సరం ఆగష్టు లో జరిగిన ఎన్కౌంటర్ లో నయీమ్ మరణించిన సంగతి పాఠకులకు గుర్తు ఉండే ఉంటుంది. నయీమ్ గత పాతికేళ్లగా చేసిన ఆక్రమాలను, హేయమైననేరాలను కె.సి.ఆర్ సభలో ప్రస్తావించారు. నయీమ్ మరణించిన తర్వాత ప్రజలు ఎలా స్పందించారో, భాదితులు ఎలా పీర్యాదులతో ముందుకు వచ్చారో కె.సి.ఆర్ గుర్తు చేశారు. ఈ విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను ముఖ్యమంత్రి సభకు వెల్లడించారు. నయీమ్ వేర్వేరు చోట్ల దాచిన వాహనాలు, నగదు స్థిరాస్తుల మొత్తం నూరు కోట్లకు పైగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. నయీమ్ ఇరవై ఏడు హత్య కేసుల్లో నిందితుడని మరో పాతిక హత్య కేసుల్లో అనుమానితుడని చెప్పారు.
కె.సి.ఆర్ సభలో చెప్పిన విషయాలని బట్టి చూస్తే, నయీమ్ ప్రభుత్వ అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలసి నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో, సమాంతర ప్రభుత్వాన్ని ఎలా నడిపాడో తెలుస్తుంది. నయీమ్ 1993 లో ఐ పి ఎస్ అధికారి వ్యాస్ ని చంపి వార్తలకెక్కాడు. తదనంతరం లొంగిపోయినప్పటకి, పోలీసులు అతన్ని ఇంఫార్మర్ గా ఉపయోగించుకొని కొందరు నక్సలైట్ నాయకుల్ని, పౌరహక్కుల నేతల్ని మట్టుబెట్టారు. తరువాతి కాలంలో నయీమ్ దోపిడీలు, బలవంతపు వసూళ్లు, భూ సెటిల్మెంటులు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో నయీమ్ తో కొందరు పోలీసు అదికారులకి, ప్రజాప్రతినిధులకు ఉన్న సంభందాలు బహిరంగ రహస్యమే. నయీమ్ చనిపోయిన దగ్గరనుండీ ఈ వివరాలను బహిర్గతం చేయవలసిందిగా అనేకమంది కోరుతున్నారు. నయీమ్ డైరీ లలో ఉన్న రహస్య వివరాలను భూస్థాపితం చేయడం కోసమే అతణ్ణి అంతం చేసినట్లు కూడా అభియోగాలున్నాయి. కాంగ్రెస్, తెదేపా లనుండి టి ఆర్ ఎస్ లో చేరిన కొందరు నయీమ్ తో సంబందం ఉన్న వారనేది మరి కొందరి వాదన.
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కేసు విచారణ ను .సి.బి.ఐ కి అప్పగించాలని కోరగా, ముఖ్యమంత్రి తిరస్కరించారు. తెలంగాణా పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ చెయగలరనె నమ్మకం తనకు ఉన్నదని, దోషులేవరైనా వదిలేది లేదని కె.సి.ఆర్ సభకు హామీ ఇచ్చారు. కె.సి.ఆర్ చేతలు ఈ మాటల్ని నిజం చేస్తాయో లేదో కాలమే చెప్పాలి.
- Tags
- నయీమ్
Next Story