డీఎంకే సర్కార్ ఏర్పాటు చేస్తుందా?

అన్నాడీఎంకేలో తలెత్తిన ముసలం డీఎంకేకు లాభం తెచ్చిపెట్టేదిలా ఉంది. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాయడం సంచలనం కలిగించింది. త్వరలో డీఎంకే ప్రభుత్వం రానుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏ ధీమాతో స్టాలిన్ ఈ లేఖ రాశారన్నది తమిళనాడు రాజకీయవర్గాల్లో చర్చ అయింది.
పన్నీర్ తో టచ్ లో స్టాలిన్....
అన్నాడీఎంకేలో శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం వార్ కొనసాగుతున్న నేపథ్యంలో డీఎంకే నేత స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు. తర్వాత లేఖను విడుదల చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో స్టాలిన్ టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ పన్నీర్ ను పిలవకుండా శశికళకు బలనిరూపణకు గవర్నర్ అనుమతిస్తే డీఎంకేకు మద్దతు తెలపాలని స్టాలిన్ కోరినట్లు సమాచారం. అలాగాకుండా పన్నీర్ సెల్వాన్ని బలనిరూపణకు పిలిస్తే డీఎంకే మద్దతిస్తుందని చెప్పారు. స్టాలిన్ వ్యూహ ప్రకారం అన్నాడీఎంకేలో ఏర్పడ్డ ఏ ప్రభుత్వమైనా నెలలకు మించి సాగదని అభిప్రాయపడుతున్నారు. వారిలో వారు కుమ్ములాడుకుని తమకు అధికార పగ్గాలు అప్పగిస్తారని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మొత్తం మీద అన్నాడీఎంకేలో ముసలం డీఎంకేకు కలిసివచ్చినట్లుంది.