ట్రంప్ హిందీ నేర్చుకున్నాడా?

అవును మరి... ఎన్నికల వేళ నాలుగు ఓట్లు ఉన్నాయంటే.. ఆ ఇంట్లో పాచిపని చేయడానికైనా ప్రచారపర్వంలో నాయకులు ఎగబ డుతూ ఉంటారు. ఎన్నికల ప్రచార సమయంలో మురికివాడల్లో తిరగడం, అక్కడి ముసలి వాళ్లను ముద్దు పెట్టుకోవడం, మురికిగా ఉన్న పిల్లల్ని ఎత్తుకుని ఫోటోలు దిగడం... ఇలాంటి గిమ్మిక్కుల మీద మన సినిమాల్లో లెక్కలేనన్ని సెటైర్లు ఇప్పటికీ పేలుతూనే ఉంటాయి. అలాంటి నాయకుల లక్షణాలు మన దేశంలో అయినా, అమెరికాలో అయినా ఒకే రీతిగా ఉంటాయనడానికి నిదర్శనం ఇది.
అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికాలో భారతీయ ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారతీయ ఓటర్లు ఎటు మొగ్గుతారనేది ఫలితాల్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉంటుందని కూడా అంటుంటారు. అందుకే భారతీయ ఓటర్లను ఆకట్టుకునే ప్రకటనకు కూడా అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు.
అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే నోటిదూకుడు మాటలకు పెట్టింది పేరు అయిన, మొన్నమొన్నటిదాకా భారతీయుల్ని తిరిగి స్వదేశానికి వెళ్లగొట్టడం గురించి అవాకులు చెవాకులు పేలినట్లుగా చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు హిందీ నేర్చుకుని హిందీలో ఓ డైలాగు పలుకుతూ.. భారతీయ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ అనుకూల వాదులు ఆయన ప్రచార నిమిత్తం ఓ వీడియో ను రూపొందించారు. ఇది ప్రధానంగా భారతీయ ఓటర్లను ఉద్దేశించిన వీడియో. ఇందులో హిందువులు అన్నా, భారతదేశం అన్నా తనకెంతో గౌరవం అంటూ రకరకాల ప్రేమపూర్వక మాటలను గుదిగుచ్చి వడ్డించిన డొనాల్డ్ ట్రంప్ ‘‘అబ్ కీ బార్.. ట్రంప్ సర్కార్’’ (ఈసారి ట్రంప్ ప్రభుత్వమే) అంటూ ఒక్క డైలాగును మాత్రం వచ్చీరాని హిందీలో ముచ్చటగా పలుకుతూ.. ఆసక్తి కలిగిస్తున్నారు. అయితే ఇలాంటి గిమ్మిక్కులు భారతీయ ఓటర్లను ఆకట్టుకుంటాయా? వారి ఓట్లను కొల్లగొట్టి, అతనికి అధికారం అందిస్తాయా? అనేది చూడాలి.