టీ కాంగ్రెస్ ను మళ్లీ ఇరుకున పెట్టిన జానా!

తెలంగాణ రాష్ట్ర సమితి మీద పోరాటం సాగించడంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారందరూ కలిసి నానా కష్టాలు పడుతూ ఒక రేంజి వరకు తమ పోరాటాన్ని తీసుకువస్తారు. ఈలోగా.. ఒక్కసారిగా జానారెడ్డి ఎంట్రీ ఇచ్చి వారి పోరాటాన్ని తుస్సు మనిపించేస్తారు. ఏదో కోణంలో తెరాస ప్రభుత్వానికి అనుకూలమైన ప్రకటన చేయడం ద్వారా తమ వారిని డిఫెన్సులో పడేస్తారు. అధికార పార్టీ చేతికి అస్త్రాలను అందిస్తారు. జానాను చూసి నేర్చుకోండి.. ప్రభుత్వంలో మంచి జరుగుతూ ఉంటే చూసి అభినందించడం నేర్చుకోండి.. అంటూ పాలకపక్షం తమ వారిని తిట్టడానికి సరైన ఆయుధాలను జానానే అందిస్తారు. సరిగ్గా అలాంటిదే ఇప్పుడు కూడా జరిగింది.
తెలంగాణ సర్కారు పాలన గురించి అప్పుడప్పుడూ జానారెడ్డి పాజిటివ్ కామెంట్లు చేయడం కొత్త విషయం కాదు. అయితే తాజాగా నీటిప్రాజెక్టుల్లో అవినీతి, రైతు రుణమాఫీ, ఫీజు రీ ఇంబర్స్మెంట్ అంశాల మీద కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున వారి మీద పోరాటం చేస్తున్న సమయంలో కీలకమైన అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఉండి కూడా.. వారిని ప్రశంసించడం , ఆ పార్టీలోని ఇతర నాయకులను జీర్ణించుకోలేని అంశం.
నల్గొండ జిల్లా పెద్దవూర లోని మాధవరెడ్డి ప్రాజెక్టు వరదకాల్వ పంప్‌హౌస్ ట్రయల్ రన్ పనులను చూసేందుకు జానారెడ్డి కూడా వెళ్లారు. అక్కడే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తారసపడడంతో.. ఇక్కడి రైతులకు 50వేల ఎకరాలకు సాగునీరివ్వడం గొప్ప విషయం అంటూ అభినందించారు. ప్రాజెక్టు వద్ద అధికారులు కూడా చాలా కష్టపడి చేస్తున్నారంటూ కితాబులిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెరాస ప్రభుత్వానికి కితాబులిస్తూ జానారెడ్డి మాట్లాడడం విశేషం.
జానారెడ్డి గతంలోనూ ఇలాంటివే చేశారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేయిస్తున్నప్పుడు కాంగ్రెస్ లోని నాయకులంతా దాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకిస్తోంటే.. జానారెడ్డి మాత్రం రీడిజైనింగ్ వల్ల మంచి జరుగుతుందని వాదించారు. రీడిజైనింగ్ కు వ్యతిరేకంగా పార్టీ పాదయాత్ర నిర్వహించినా కూడా.. తాను మాత్రం పాల్గొనబోయేది లేదని ఆయన తెగేసి చెప్పేశారు. అలా చేసిన ప్రతిసారీ.. జానాను చూసి ప్రభుత్వ చర్యలను అభినందించడాన్ని కాంగ్రెస్ శ్రేణులు నేర్చుకోవాలి.. అంటూ.. గులాబీ దళాలు సెటైర్లు వేయడం మామూలైపోయింది.