జోరుగా పదవుల పందేరం : ఊరిస్తున్న కేటీఆర్

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేటెడ్ పదవుల పందేరానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఈ పదవుల విషయంలో దాదాపు ఏడాదికి పైగా కార్యకర్తలను ఊరిస్తూనే ఉన్న పార్టీ నాయకత్వం ఇటీవలి కాలంలోనే దాన్ని ప్రారంబించింది. రాష్ట్రంలోకొన్ని కీలకమైన కార్పొరేషన్లను పార్టీ ముఖ్యులకు ఇచ్చి కేసీఆర్ భర్తీ చేశారు. అలాగే అనేక పదవులను ప్రకటించే క్రమంలో పార్టీతో సంబంధం లేకపోయినా, ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేశారు అనే ప్రాతిపదిక మీద చాలా మందికి పదవుల కేటాయింపులు జరిగాయి. కేసీఆర్ తటస్థులుగా ఉన్నవారి మీద కూడా పార్టీ ముద్ర వేసేందుకు పదవులు ఇచ్చేస్తున్నారంటూ కిట్టని వారు విమర్శలు గుప్పించారు కూడా!!
అయితే నిజానికి పార్టీ శ్రేణులను ఎంతగానో ఊరించే నామినేటెడ్ పదవుల పందేరం అప్పుడే పూర్తయిపోలేదు. ఆ పర్వం మీద ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. తాజాగా సీఎం తనయుడు కేటీఆర్ కూడా.. అదే విషయం చెప్పి పార్టీ శ్రేణులను ఊరిస్తున్నారు. వరంగల్ పరిధిలోని వుడా ఛైర్మన్ గా మర్రి యాదవరెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ఈ మేరకు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. మొత్తానికి కేసీఆర్ పార్టీ విస్తరణ, బలోపేతానికి బహుముఖ వ్యూహంతో వెళుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. కార్యకర్తలకు పార్టీ పదవులు పంచడానికి జిల్లాల సంఖ్య పెరగడం బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆయన నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఉదారంగా ఇచ్చేస్తూ.. కార్యకర్తల ముద్ర, పార్టీకోసం కష్టపడి పనిచేసే అలవాటున్న వారందరికీ ఏదో ఒక ఫలితం దక్కే పరిస్థితి కల్పిస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డానికి సంబంధించిన సెటైర్లు విమర్శలకు అప్పుడే ఫుల్స్టాప్ పడడం లేదు. గడ్డాలు పెంచుకుంటే ముఖ్యమంత్రి కాలేరంటూ కేటీఆర్ ఉత్తంకుమార్ పై సెటైరు వేశారు. గడ్డాలు పెంచుకుంటే సన్నాసుల్లో కలిసిపోవాల్సిందే తప్ప సాధించేదేమీ ఉండదని కేటీఆర్ చెప్పారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో సీరియస్ గా చేస్తున్న ఆరోపణల పర్వాన్ని , అధికార తెరాస చాలా తెలివిగా తక్కువ చేసి స్పందిస్తోంది. అవన్నీ పోచికోలు కబుర్లు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.