జైలు నుంచే చిన్నమ్మ ఆదేశాలు
పరప్పణ అగ్రహారం జైలుకు నేతలు పోటెత్తుతున్నారు. బెంగుళూరు జైలులో ఉన్న చిన్నమ్మను పరామర్శించేందుకు ఆమె అభిమానులతో పాటు నేతలు కూడా వస్తున్నారు. తన మేనల్లుడు టీటీవీ దినకరన్ తో శశికళ దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై దినకరన్ తో చిన్నమ్మ చర్చించినట్లు చెబుతున్నారు. ఏ నిర్ణయమైనా తనకు తెలియకుండా తీసుకోకూడదని కూడా దినకరన్ కు శశికళ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తనను చెన్నై జైలుకు మార్చడంపై ఉన్న అవకాశాలను కూడా చిన్నమ్మ దినకరన్ కు వివరించారట. అలాగే ఈరోజు మరో ఇద్దరు మంత్రులు శశికళను కలుసుకునేందుకు బెంగుళూరు బయలుదేరారు.
ఇంటి భోజనానికి ఓకే...
ఇదిలాఉండగా చిన్నమ్మ చేసి విజ్ఞప్తిపై కోర్టు కొన్ని విషయాల్లో సానుకూలంగా చూపింది. తనకు ప్రత్యేక గదిని కేటాయించాలన్న శశికళ కోరికను కోర్టు మన్నించింది. ఈరోజు నుంచే ఆమెకు ప్రత్యేక గదిని కేటాయించారు జైలు అధికారులు. మరోవైపు ఇంటి భోజనం తెప్పించుకోవడానికి కూడా అనుమతిచ్చారు. ఇవేమీ శశికళ పట్టించుకోకుండా తనను వీలయినంత త్వరగా చెన్నై లేదా వేలూరు జైలుకు మార్చేలా ప్రయత్నించాలని తనను కలిసిన నేతలకు చెబుతున్నారట. మొత్తం మీద శశికళ కర్ణాటక జైలు నుంచే తమిళనాడు పాలనను నడుపుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
- Tags
- జైలులో చిన్నమ్మ