జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా?

వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ఢిల్లీ స్థాయిలో ప్రత్యేక హోదాపై హీట్ పుట్టించేందుకు పథక రచన చేస్తున్నారా? అవుననే అనిపిస్తోంది. ముఖ్యంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై ఆదివారం వైసీపీ ఎంపీలతో జగన్ సమావేశమవతున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు.
రాజీనామాలా? అవిశ్వాసమా?
స్పెషల్ స్టేటస్ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా యువత ఈ అంశంపై ప్రభుత్వాలతో తలపడేందుకు సిద్ధమవుతోంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయించాలన్నది ఒక నిర్ణయంగా విన్పిస్తోంది. దీనివల్ల పార్టీ ప్రతిష్ట ఏపీలో మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనికి వైసీపీ ఎంపీలు ఒప్పుకుంటారా? మరో మూడేళ్లు పదవీకాలం ఉండటంతో వారు ఏ మేరకు అంగీకరిస్తారన్నది చూడాలి. అయితే జగన్ ఆదేశిస్తే తాము ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని ఎంపీలు చెబుతున్నారు. దీనివల్ల కేంద్రం వెంటనే దిగిరాకపోయినా పార్టీకి ఏపీలో మైలేజ్ వచ్చే అవకాశముంది. రాజీనామాలతో కాకుండా బీజేపీపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టడం రెండోది. అవిశ్వాసం వల్ల పూర్తి మెజార్టీ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఏమీ కాకున్నా...స్పెషల్ స్టేటస్ పై చర్చ జరిగే అవకాశముందని, దాంతో తమ వాయిస్ ను బలంగా దేశ వ్యాప్తంగా విన్పించవచ్చని జగన్ ఆశిస్తున్నారు. ఈ రెండు నిర్ణయాలపై ఈరోజు జరిగే వైసీపీ ఎంపీల సమావేశంలో నిర్ణయిస్తారని తెలుస్తోంది.