గంటల వ్యవధిలోనే : సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్

జైలు సిబ్బందిని హతమార్చి, జైలునుంచి పరారైన సిమి ఉగ్రవాదులను భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. జైలునుంచి పరారైన కొన్ని గంటల వ్యవధిలోనే ఉగ్రవాదులను చుట్టుముట్టి పోలీసులు ఎన్కౌంటర్ చేయడం విశేషం. ఉదయం ఉగ్రవాదులు పరారైన విషయం బయటకు వచ్చిన తర్వాత.. భోపాల్ పోలీసులు వారికోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటూ.. నగర శివార్లలోనూ పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. శివార్లలో ఉగ్రవాదులందరూ ఒకే చోట కనపడగానే.. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు వారిని చుట్టుముట్టి హతమార్చారు.
అంతర్జాతీయంగా సిమి ఉగ్రవాదులు అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భోపాల్ జైలులో ఉన్న 8 మంది కాపలాగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను హత్యచేసి పారిపోయారు. భోజనం చేసే పళ్లేలు, దుప్పట్ల సాయంతో వారు పరారైనట్లు వార్తలు వచ్చాయి. వీరి పరారీకి సంబంధించి నలుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు.
ఇప్పుడు ఎన్కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదులు మొత్తం 8 రాష్ట్రాల్లో వేర్వేరు నేరాలకు పాల్పడినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఆ మేరకు వారు పరారు కాగానే 8 రాష్ట్రాల్లోనూ రెడ్ అలర్ట్ ప్రకటించారు.
అయితే పరారైన ఉగ్రవాదులు జైలునుంచి బయటకు రాగానే.. బృందాలుగా విడిపోయి నగర శివార్లలో ఒక చోట కలుసుకోవాలని వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తోంది. పైగా జైలునుంచి బయటకు వచ్చిన వెంటనే వీరికి బయటి వ్యక్తులు ఎవరో సహకరించి, ఆయుధాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్కౌంటర్ లో మరణించిన వారినుంచి పోలీసులు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. బయటినుంచి వారికి ఎవరు సహకరించి ఉంటారనే విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.