ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కొందరు అవినీతిపరులు హైదరాబాద్ ను అడ్డాగా మార్చుకున్నారు. వెలగపూడిలో ఫైలు క్లియరెన్స్ కావాలంటే హైదరాబాద్ లో క్యాష్ కొట్టాల్సిందే. ఇదో కొత్త టెక్నిక్. ఏపీ ఉద్యోగులకు వారంలో ఐదు రోజులే పనిదినాలు. మిగిలిన రెండు రోజులు వారి మకాం హైదరాబాద్ లోనే. అయితే ఇటీవల వెలగపూడి సచివాలయంలో హోంమంత్రిత్వ శాఖలోని ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. అప్పటి నుంచి ఉద్యోగులు తమ అవినీతి పంథాను మర్చారు. ఏసీబీకి చిక్కకుండా కొత్త దారులను వెతుక్కుంటున్నారు.
ఫైలుకో...రేటు...
ప్రతి ఫైలుకు ఒక రేటుంటుంది. ముఖ్యమంత్రి ఎవరైనా.... ప్రభుత్వం ఎవరి చేతిలో ఉన్నా... కక్కుర్తి అధికారులు లంచాలు లేనిదే ఫైళ్లు కదల్చరు. ఇందుకు ఏపీ సచివాలయానికీ మినహాయింపు లేదు. ముఖ్యమంత్రి పదేపదే అవినీతిని సహించనని చెబుతున్నా...అవినీతికి అలవాటు పడిన ఉద్యోగులు కొందరు తమ పంధాను మార్చుకోవడం లేదు. వీరు శని, ఆది వారాలు హైదరాబాద్ వస్తుండటంతో ఇక్కడే ఫైలు కు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టుకుంటున్నట్లు తెలిసింది.
కేజీ.....అంటే...వెయ్యి....
సాధారణరోజుల్లో ఫైలు అర్జంట్ గా కదలాలంటే అందుకు కూడా ఉపాయాలు ఆలోచించారు. కొందరు హైదరాబాద్ లో తమ ఏజెంట్లను నియమించుకున్నట్లు సమాచారం. పనిదినాల్లో హైదరాబాద్ లో వారికి సొమ్ము ముట్టజెబితే వెలగపడి ఫైలు కదులుతుంది. ఇందుకు కోడ్ బాషను కూడా వారు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైలుకు సంబంధించి సొమ్ము ముట్టగానే సదరు అధికారికి హైదరాబాద్ నుంచి మెసేజ్ వస్తుంది. వారు కోడ్ గా పండ్లను ఎంచుకున్నారు. ఉదాహరణకు ఒక ఫైలు కదలాలంటే పదివేలు ఇవ్వాలనుకుందాం. పదివేలు సదరు వ్యక్తి ఏజెంటుకిస్తే వెంటనే తను....పది కేజీల ద్రాక్ష రిసీవ్ డ్ సర్ అనే మెసేజ్ పంపుతారు. వెయ్యి రూపాయలను కేజీల్లో చెబుతున్నారన్నమాట. ఏసీబీ అధికారులకు చిక్కకుండా ఏపీ సచివాలయ ఉద్యోగుల ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏసీబీ అధికారులూ....మీరు కూడా వీకెండ్ లో హైదరాబాద్ వెళ్లాల్సిందే మరి.
కొసమెరుపు: ఫైలు కదలాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిందేనని బాధితులు ఆవేదన చెందుతున్నారు. రాజధాని తమ ప్రాంతానికి వచ్చిందని సంబర పడుతుంటే... లంచం ఇవ్వడానికి మళ్లీ హైదరాబాద్ వెళ్లాల్సి రావడమేంట్రా అని బాధితులు జుట్టు పీక్కుంటున్నారు.