కోర్ కేపిటల్‌కు ఘనంగా శంకుస్థాపన!

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరంలో ప్రభుత్వ అధికార భవనాల సముదాయం (కోర్ కేపిటల్) నిర్మాణానికి శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు శాస్త్రోక్తంగా శంకుస్థాపన జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోర్ కేపిటల్ నిర్మాణం, ఏడు ప్రధాన రోడ్ల నిర్మాణం, రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు. అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి లింగాయపాలెం పరిధిలో పునాదిరాయి వేశారు. లింగాయపాలెం రాయపూడి మధ్యలో 950 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయం రాబోతున్నది.
ఈ కోర్ కేపిటల్ పరిధిలోనే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కీలక భవనాలు అన్నీ ఏర్పాటు అవుతాయి. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి, గవర్నర్ రాజ్‌భవన్, ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, నివాస భవన సముదాయాలు అన్నీ ఈ పరిధిలోనే ఏర్పాటు అవుతాయి.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ లు మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబునాయుడు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ఏపీ ని ఖచ్చితంగా పురోగమన పథంలో తీసుకువెళతారని వారు కితాబులిచ్చారు. రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడం అనేది ఓ అపురూపమైన విషయంగా వారు అభివర్ణించారు.
మోదీ పరిపాలనలో దేశం ఎంతో ముందుకు పోతున్నదని, రాష్ట్ర ప్రభుత్వ సారధిగా చంద్రబాబునాయుడు కేంద్రంతో సహకరిస్తూ ప్రగతి పథంలో ముందుముందు చాలా పథకాలు సాధించబోతున్నారని, హోదాలో గానీ, ప్యాకేజీలోగానీ లేని ఇంకా చాలా పథకాలు లబ్ధి రాష్ట్రానికి జరగబోతున్నదని చెప్పారు.