కోడికి కత్తి కడితే జైల్లోనే
కోడి పందాలను నిషేధిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. పందెంకోళ్లను పెంచుతున్న వారితో పాటు....వాటికి కత్తి కట్టే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయనున్నారు. సంక్రాంతి మూడు రోజులు వాళ్లు స్టేషన్లోనే ఉండాలని పోలీసులు చెబుతున్నారు. కోడి పందేలు నిర్వహించొద్దని హైకోర్టు తీర్పు చెప్పడంతో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే వేల సంఖ్యలో పందెం కోళ్లను వాటి పెంపకం దారులను గుర్తించారు. అయితే కోడిని బరిలోకి దింపే ముందు కోడికాలికి కత్తి కట్టాలి. అతి పదునైన ఈ కత్తిని కట్టేందుకు మెళుకువలు తెలిసి ఉండాలి. పందేల సమయంలో కత్తిగట్టే వారికి యమా గిరాకీ. కోడికి ఐదు వందల రూపాయలు ఇచ్చి మరీ కత్తి కట్టిస్తారు. వారికంతటి డిమాండ్. అందుకోసం పోలీసులు కోడి కాలికి కత్తి కట్టకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కత్తి కట్టే వారు ఎంత మంది ఉంటారని ఆరా తీశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడికి కత్తికట్టే నేర్పు ఉన్నవారు 700 మంది వరకూ ఉన్నారు. వీరిలో 500 మంది పశ్చిమ గోదావరి జిల్లావాసులే. ఇప్పటికే వీరిలో 350 మందిపైన పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. కోడికి కత్తి కట్టినట్లు తెలిస్తే కేసు పెట్టి జైల్లో వేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మంత్రులకు కోడి బెంగ....
ఇదిలా ఉండగా కోడిపందేల నిషేధం విషయంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కోడి పందేల నిర్వాహకులు, పెంపకందారులు, పందెంకారులు మొత్తం మంగళవారం భీమవరంలో సమావేశమయ్యారు. జీవహింస పేరుతో కోడిపందేలను ఆపటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. అలా అంటే రోజుకు ఎన్నికోళ్లను ఆహారంగా తీసుకోవడం లేదు. అది జీవహింస కిందకు రాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. కోడిపందేల నిషేధంపై సుప్రీంకోర్టుకు వెళదామన్న పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజుకు అందరం అండగా నిలవాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కలసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి కోడిపందేలు నిర్వహించుకునేలా వత్తిడి తేవాలని కూడా సమావేశంలో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా ఏడాదికొకసారి జరుపుకునే పందేలను అడ్డుకుంటే సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో మంత్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. కోడిపందేలను పూర్తిగా నిషేధిస్తే తమకు ఓట్ల గండం ఉంటుందని వారు భయపడుతుండటంతో ఈ విషయాన్ని సీరియస్ గా సీఎం వద్దకు తీసుకు వెళ్లాలని అమాత్యులు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.