కేసీఆర్ నెంబర్ 1... చంద్రబాబు నెంబర్ 8!!

దేశవ్యాప్తంగా నాయకులకు ఉండే ప్రజాదరణ ఏమిటో ఓ ప్రెవేటు సంస్థ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా జనాదరణ విషయంలో గులాబీ బాస్ తిరుగులేని స్థానంలో ఉన్నారని తేలింది. ఈ సర్వే ప్రకారం దేశంలోనే అందరు ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఏకంగా 87 శాతం మంది ప్రజలు ఆయనను అభిమానిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు ఉన్న జనాదరణ 58 శాతం మాత్రమే. ఆయన 8వ స్థానంలో ఉన్నారు.
వీడీపీ అసోసియేట్స్ అనే సర్వే నిర్వహణ సంస్థ అప్పుడప్పుడూ ఇలాంటి సర్వేలు నిర్వహిస్తోంది. 2016 మేలో కూడా వీరు ఇలాంటి సర్వేనే నిర్వహించారు. అప్పట్లో 86 శాతం ఆదరణతో కేసీఆర్ నెంబర్ వన్ గా నిలిచారు. ఇప్పుడు మళ్లీ అదే సర్వే నిర్వహించారు. కేసీఆర్ కు ఒక శాతం ఆదరణ పెరిగింది. 87 శాతంతో ఆయన నెంబర్ వన్ గా ఉన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు 85 శాతం ఆదరణతో రెండో స్థానం, మమతా బెనర్జీకి 79 శాతం ఆదరణతో మూడో స్థానం దక్కాయి.
ప్రధానంగా మాత్రం జనం ఇప్పటికీ మోదీనే ఇష్టపడుతున్నారు. ఆయనకు ఇప్పట్లో తిరుగులేదని ఈ సర్వే తేల్చింది. మోదీకి 53 శాతం జనాదరణ దక్కితే మిగిలిన నేతల్లో ఎవ్వరికీ కనీసం రెండంకెల ఆదరణ లభించలేదు. మామూలుగా నిత్యం తాను చేయించు సర్వేలతో తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును తూకం వేస్తూ ఉండే చంద్రబాబునాయుడు మాత్రం ఈ సర్వేలో 8వ స్థానానికి పరిమితం అయ్యారు.