కర్ణాటకలో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ

కాంగ్రెస్ పార్టీకి రోజులు బాగున్నట్లు లేదు. ఏది పట్టుకున్నా కలిసి రావడం లేదు. చివరకు సీనియర్లు కూడా కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. కర్ణాటకకు చెందిన ఎస్.ఎం. కృష్ణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కృష్ణ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కూడా లేఖ రాశారు. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలను ఎస్. ఎం. కృష్ణ ఒకప్పుడు శాసించారు. 1999 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్.ఎం.కృష్ణను ముఖ్యమంత్రిని చేసింది పార్టీ హైకమాండ్. ఆయన 2004 వరకూ కర్ణాటక ముఖ్యమంత్రిగానే ఉన్నారు. పరిపాలనదక్షుడిగా మంచిపేరే తెచ్చుకున్నారు.
మహారాష్ట్ర గవర్నర్ గా కొంతకాలం పనిచేసిన ఎస్.ఎం.కృష్ణ తర్వాత మన్మోహన్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన టెన్ జన్ పథ్ కు ఎప్పుడూ విధేయుడే. అలాంటి కృష్ణ పార్టీని వీడటం పార్టీ సీనియర్ నేతలను షాక్ కు గురిచేసింది. కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోకడలు నచ్చకే కృష్ణ పార్టీ నుంచి వైదొలిగినట్లు చెబుతున్నారు. కృష్ణకు, సిద్ధరామయ్యకు గత కొంతకాలంగా అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే పార్టీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని కృష్ణ చెబుతున్నారు. అయితే దీనిపై ఎస్.ఎం.కృష్ణను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.
- Tags
- కాంగ్రెస్