ఏపీ కేబినెట్ : నాలుగు వర్సిటీలు; తతిమ్మా వాయిదాలు

నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయాలు ఏమీ లేకుండానే ముగిసిపోయింది. కీలకంగా నిర్ణయాలు తీసుకోవాలని అంశాలను నిరంతరాయంగా వాయిదా వేశారు. కాకపోతే.. సదరు వాయిదాకు ‘కేబినెట్ సబ్ కమిటీ’ అని పేరు పెట్టారు. తెలంగాణకు సచివాలయ భవనాల అప్పగింత వ్యవహారం లో ఒక పట్టాన అప్పగించడం ఇష్టం లేకపోతే గనుక.. కేబినెట్ సబ్ కమిటీ వేయడం ఒక ఎత్తు. కనీసం కొన్ని వారాలుగా రాష్ట్రమంతా సగటు ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్న కృష్ణాజలాల పంపకంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై కూడా.. కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. దానికి కూడా ఓ కేబినెట్ సబ్ కమిటీ వేసి వాయిదా వేశారు. టెక్స్ టైల్ పరిశ్రమను ఆదుకునేందుకు 350 కోట్ల విద్యుత్తు భారాన్ని మాఫీ చేయడం. ప్రెవేటు యూనివర్సిటీలకు పచ్చజెండా ఊపడం తప్ప విశేషాలు ఏమీ లేవు.
కేబినెట్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాదులోని సచివాలయంలో ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించే విషయంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, కామినేని సభ్యులుగా ఉంటారు.
- రాష్ట్రంలో నాలుగు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. విశాఖలో వేవ్ టెక్, మిట్స్ ప్రైవేటు వర్సిటీలు, చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీ సెజ్ లో ఐఎఫ్ఆర్ఎం, గ్రేట్ లేక్స్ యూనివర్సిటీ లు రానున్నాయి.
- కృష్ణా జలాల పంపకాల గురించి భవిష్యత్ కార్యాచరణ గురించి నిర్ణయించేందుకు ఓ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశు.
- విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్థానంలో , విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీగా నామకరణం చేశారు.
- విశాఖపట్టణం, మధురవాడ కొమ్మాది ప్రాంతాల్లో 400 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా సేకరించాలని నిర్ణయించారు.
- ఖాయిలా పడ్డ టెక్స్టైల్ పరిశ్రమకు 350 కోట్ల రూపాయల విద్యుత్తు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు.