ఏపీలో హోరెత్తుతున్న నిరసనలు...ఎక్కడికక్కడ అరెస్ట్ లు

ఏపీలో ప్రత్యేక హోదాపై నిరసన హోరు కొనసాగుతోంది. విశాఖ ఆర్కేబీచ్ లో ఉద్యమం చేస్తామని ఏపీ యువత పిలుపు నిచ్చినా 13 జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. యువత వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాను చేత బూని తమ నిరసనను తెలియజేస్తోంది. అయితే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. తిరుపతి లో ఎస్వీ యూనివర్సీటి విద్యార్థులు మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎస్వీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జేఎన్టీయూలో కూడా అరెస్ట్ లు చేశారు. ఇక్కడ విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి కూడా చేశారు.
జగన్ కాన్వాయ్ సీజ్...
విశాఖలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విద్యార్థి బయటకొస్తే అరెస్ట్ చేస్తున్నారు. విశాఖ మొత్తాన్నిపోలీసులు జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్ -విశాఖ రహదారిపై అనేక చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అటు వైపు వచ్చే విద్యార్థులను, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. సాధారణ పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలనూ రంగంలోకి దింపారు. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపేందుకువచ్చిన హీరో సంపూర్ణేష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ నుంచి నాలుగు బస్సుల్లో వస్తున్న విద్యార్థులను పాయకరావుపేట వద్ద అదుపులోకి తీసుకున్నారు. దీంతో విశాఖలో తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. విద్యార్థులు కూడా ఒక ప్లాన్ ప్రకారం విడతల వారీగా రోడ్లపైకి వస్తున్నారు. ఇక జగన్ కాన్వాయ్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రతిపక్ష నేతకు నాలుగు ప్రభుత్వ వాహనాల కాన్వాయ్ ఉంటుంది. అయితే జగన్ ఈ సాయంత్రం విశాఖకు చేరుకుంటుడటంతో కాన్వాయ్ ముందుగానే విశాఖ బయలుదేరింది. కాని పోలీసులు జగన్ కు కేటాయించిన వాహనాలను తమ స్వాధీనం లోకి తీసుకున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన వాయిదా
విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి శుక్రవారం విశాఖలో ప్రారంభం కానున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రమే బయలుదేరాల్సి ఉంది. ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే విశాఖలో ఉద్రిక్తత నెలకొని ఉండటంతో తన పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నారు. శుక్రవారం ఉదయం 9గంటలకు విజయవాడ నుంచి విశాఖకు బయలుదేరి వెళతారు.
- Tags
- ఏపీలో నిరసనలు