ఏటీఎంలో మహిళపై దాడి నిందితుడి అరెస్ట్?
సంచలనం సృష్టించిన బెంగళూర్ ఏటీఎం దాడి కేసు నిందితుడిని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్ళ క్రితం ఎటిఎం లో నగదు డ్రా చేయడానికి వచ్చిన మహిళపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాడు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఎటిఎం ల వద్ద గార్డు లను ఆర్.బీ. ఐ తప్పనిసరి చేసింది. ఈ కేసులో నిందితుడి కోసం బెంగళూరు పోలీసులు మూడేళ్ళుగా గాలిస్తూనే ఉన్నారు.
కడప జైలు నుంచి పరారై...
అదే సమయంలో ఐదు సంవత్సరాల క్రితం కడప కేంద్రకారాగారం నుంచి పరారై ఇటీవల చిత్తూరు పోలీసుల అదుపులో ఉన్న మధుకర్ రెడ్డిని మూడేళ్ల క్రితం బెంగుళూరు ఏటీఎంలో మహిళ పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. జైలు నుంచి పరారైన మధుకర్ రెడ్డి బెంగళూరులో ఉంటూ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయ్యింది. అప్పట్లో ఏటీఎంలోని సీసీ పూటెజ్ లో ఉన్న వ్యక్తీ.. మధుకర్ రెడ్డి ఒకేలా ఉండటంతో దీని పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు ఘటనలో నిందితుడు ఆంధ్రాలో ఉన్నట్లు కర్ణాటక పోలీసులు అప్పట్లోనే అనుమానం వ్యక్తం చేశారు.
హత్య కేసులో నిందితుడు...
ప్రస్తుతం చిత్తూరు పోలీసుల అదుపులో ఉన్న మధుకర్ రెడ్డి తంబళపల్లె మండలం ముద్దులాపురం గ్రామానికి చెందినవాడు.2006లో గ్రామంలో బాంబులు వేసి ఒకరిని హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ సమయంలోనే 2011లో కడప జైలు నుంచి పరారయ్యాడు. బెంగళూరు ఏటీఎం ఘటనలో పాల్గొన్న వ్యక్తి, ప్రస్తుతం చిత్తూరు పోలీసుల అదుపులో ఉన్న మధుకర్ రెడ్డి ఒక్కరేనా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. కాగా, 2013లో బెంగళూరులో డబ్బులు తీసుకోవడానికి వచ్చిన మహిళపై ఓ గుర్తు తెలీని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యింది. ఈ ఘటనతోనే ఎటిఎం లలో భద్రతా లోపాలపై కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి.