ఎక్స్క్లూజివ్ : బళ్లారిలో 50% ఇస్తున్నారంట!

నల్లకుబేరులు ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వీలైనంత తెల్లధనంగా మార్చుకోవడానికి అవస్థలు పడుతున్నారు. సాధారణ పౌరుల చేతికి డబ్బు లక్షల్లో ఇచ్చి వారి అకౌంట్లలో వేసుకుని, ఆ తర్వాత నిదానంగా బ్యాంకు నుంచి విత్ డ్రా చేసి తమకు ఇచ్చే లాగా.. ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇలా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి 6 నుంచి 30 శాతం వరకు కమిషన్లుగా తీసుకుంటున్నట్లు పత్రికలు, టీవీ ఛానళ్లలో వార్తలు కూడా వచ్చేశాయి. మీడియాలో ఇలాంటి వార్తలు రాగానే.. ప్రజలంతా కూడా అప్రమత్తం అయిపోయి.. 30 శాతం అనేది అఫిషియల్ రేటుగా ఫిక్స్ చేసుకున్నారు. 30 శాతం కమిషన్ ఇస్తే.. నల్లడబ్బు మార్చి ఇవ్వడానికి ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో మరింత భారీ కమిషన్ల వ్యవహారం నడుస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. బళ్లారిలో నగరం మొత్తం కుబేరులంతా మైనింగ్ మనీని వందల కోట్ల రూపాయలు కలిగి ఉంటారనేది అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు ఆ నల్ల కుబేరులంతా డబ్బును వైట్ గా మార్చుకునే పాట్లు పడుతున్నట్లు సమాచారం.
బళ్లారిలో డబ్బు కూడా చాలా పెద్ద మొత్తాల్లో ఉంటుంది గనుక.. కమిషన్లు కూడా భారీగానే నడుస్తున్నాయని తెలుస్తున్నది. యాభైశాతం కమిషన్ ఇచ్చేలా ఒక్కొక్క వ్యక్తికి 3 లక్షల రూపాయల వరకు క్యాష్ ఇచ్చి అకౌంట్లలో వేసుకోవాల్సిందిగా నల్లకుబేరులు ఒప్పందాలు చేసుకుంటున్నారట. 50 శాతం మొత్తాన్ని నెల రోజుల తర్వాత ఇచ్చేలా ముందే వారి నుంచి ఒక చెక్ తీసుకుని, సొమ్ము లిస్తున్నట్లు సమాచారం.
బళ్లారిలో అపర కుబేరుడిగా పేరున్న గాలి జనార్దనరెడ్డి వ్యవహారం ఇంకో రకంగా సాగుతోంది. గాలి జనార్దనరెడ్డి నివాసం ఉన్నటువంటి బళ్లారిలోని ఆవుంబాయి ప్రాంతంలో పోలీసులు పూర్తిగా 144 వ సెక్షన్ విధించి.. భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మరి కుబేరులంతా.. క్యాష్ డీలింగ్ లను ఎలా పూర్తిచేస్తారో... తమ వద్ద ఉన్న సొమ్ముల్ని ఎంత మేరకు వైట్ గా మార్చుకోగలరో చూడాలి.