ఉద్యోగుల విభజన కొలిక్కి.....

మిగిలింది 1200 మాత్రమే....
తాజాగా 6,298 మంది డాక్టర్ల పంపకం పూర్తి...
రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు గడుస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకం మాత్రం కొలిక్కి రావడం లేదు. అన్ని విభాగాల్లో ఉద్యోగుల పంపకం పూర్తైనా కొన్ని కీలక శాఖల్లో మాత్రం కోర్టు కేసుల నేపథ్యంలో పంపకం అసంపూర్తిగానే ఉండిపోయింది. తాజాగా 6298 మంది డాక్టర్లను రెండు రాష్ట్రాలకు పంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది., సీనియార్టీ వివాదాలతో కోర్టు కేసుల్లో ఉన్న డీఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్టు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వంటి 1200 మంది ఉద్యోగుల విభజన మాత్రమే ప్రస్తుతానికి మిగిలి ఉంది. ఉమ్మడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో గల రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని 6,298 మంది వైద్యుల తుది కేటాయింపులు ఎట్టకేలకు పూర్తి చేస్తూ కమలనాధన్ కమిషన్ నిర్ణయించింది. వీరిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు విభజిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యుల పంపకంతో ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం 153 శాఖలు, విభాగాల్లోని ఉద్యోగుల తుది పంపిణీ దాదాపు పూర్తయినట్లైంది. ఉద్యోగుల విభజనలో తొలి నుంచీ వైద్యుల పంపిణీయే కాస్త జటిలంగా ఉంటూ వచ్చింది. స్థానికత, సీనియార్టీ వంటి విషయాలపై ఏర్పడ్డ వివాదాలు ఎట్టకేలకు అనేక భేటీల తర్వాత పరిష్కారమయ్యాయి. వైద్య విద్య సంచాలకుడి పరిధిలోని 2,872 మంది వైద్యుల తుది విభజనపై జనవరి 25న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షమ శాఖ పరిధిలో ఉంటూ జిల్లాల్లో పని చేసే 6,298 మంది వైద్యుల తుది కేటాయింపులపై కేంద్రం తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. వీరిలో 2,470 మందిని తెలంగాణకు, 3,828 మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. . వీరితో కలిపితే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 153 శాఖలు, విభాగాల్లోని ఉద్యోగుల తుది కేటాయింపులు దాదాపు ముగిసినట్లైంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే విభజన చాలా త్వరగా పూర్తయిందని కమిటీ ఛైర్మన్ కమలనాథన్ అభిప్రాయపడ్డారు.