ఈ మామ... ఉన్నాడే...సరైనోడు కాదు

ఆయన పదిమందికి చదువు చెప్పే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. వేలమంది చదువుకునే యూనివర్శిటీలో విద్యార్ధుల్ని సన్మార్గంలో నడిపాల్సిన రెక్టార్ పోస్టులో ఉన్నా కాసుల కక్కుర్తి వదులుకోలేక పోయాడు. వైద్య విద్య చదువుతున్న కోడల్ని చిత్రహింసలకు గురి చేస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధ్యాపక వృత్తినే ఈ పెద్దాయన అపహాస్యం చేశాడు. లెక్చరర్ పోస్టుకన్నా మామ పోస్టు కే ప్రాధాన్యత ఇచ్చాడు.
ప్రేమించి...పెళ్లి చేసుకున్నా...
ప్రేమన్నాడు., పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.... కట్టుకున్న కొద్ది నెలలకే మోజు తీరడంతో వదిలించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడా ప్రబుద్దుడు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ రెక్టార్‌గా పనిచేస్తున్న సాంబశివరావు కుమారుడు సాయికృష్ణ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలలో చదుకున్నారు. అదే కాలేజీలో ఎంబీబీఎస్ చదివే గుంటూరు జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన బేబీ లక్ష్మీతో సాయికృష్ణ ప్రేమాయణం నడిపాడు. ఇద్దరు వైద్య విద్యార్ధులే కావడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో 2015 నవంబర్‌లో వారి పెళ్లి జరిగింది. బేబీ లక్ష్మీ ప్రస్తుతం అమలాపురంలో మెడికల్ కాలేజీలో పీజీ జనరల్ మెడిసిన్ చదువుతున్నారు. పేరుకు ప్రేమ పెళ్లి అయినా పెళ్లి సమయంలో పది ఎకరాల పొలం., 100 సవర్ల బంగారం., 25లక్షల కట్నం బేబీ లక్ష్మీ కుటుంబ సభ్యులు ఇచ్చారు.
విడాకులు తీసుకోమంటున్న మామ....
పెళ్లైన కొత్తలో బాగానే చూసుకున్నా ఆ తర్వాత నుంచి భర్త వేధింపులు ఎక్కువయ్యాయని బాధితురాలు ఆరోపిస్తోంది. కాలేజీ నుంచి రావడం ఆలస్యమైనా అనుమానంతో భర్త వేధించేవాడని., అత్తమామలు కూడా భర్తకే వంత పాడేవారని లక్ష్మి వాపోయింది. తనను పెళ్ళి చేసుకోవడం వల్ల కోట్ల రూపాయల కట్నం కోల్పోవాల్సి వచ్చిందంటూ విడాకుల కోసం వేధింపులు ప్రారంభించారని కన్నీరుమున్నీరైంది. అనుమానంతో భర్త అసభ్యకరంగా మాట్లాడినా., పొగాకు బోర్డులో ఉన్నత హోదాలో ఉన్న తన అత్త అతడినే సమర్ధించేదని., యూనివర్శిటీ రెక్టార్ అయిన మామ విడాకులు తీసుకోవాలని ఒత్తిడి చేసేవారని వాపోయింది. భర్త వేధింపులు తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహాత్యయత్నం చేస్తే కనీసం పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించింది. భర్త., అత్తమామల వేధింపులు భరించలేక పోలీస్ కేసు పెడితే ఇచ్చిన కట్నం తిరిగి ఇచ్చేస్తామని విడాకుల కోసం రాజీ చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని వాపోయింది. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త సాయికృష్ణ., రెక్టార్ సాంబశివరావులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఆరోపణలపై స్పందించేందుకు రెక్టార్ సాంబశివరావు నిరాకరించారు.
- Tags
- వరకట్న వేధింపులు