ఈ మంత్రుల కామెంట్స్ పై మండిపడుతున్న యువత
ఒకపక్క ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ నిరసనలు చేస్తుంటే కేంద్రమంత్రులు,రాష్ట్ర మంత్రులు రెచ్చగొట్టే రీతిలో ప్రకటనలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన ప్రత్యేక హోదా నిరసనపై ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. విశాఖ మొత్తం పోలీసుమయంగా మారింది. ఆర్కే బీచ్ మొత్తం ఆంక్షలు విధించారు. ఆంక్షలతో తమ ఆకాంక్షను అణగదొక్కారని ఇప్పటికే యువత మండిపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యాఖ్యలు కాక రేపాయి. జల్లికట్టు స్ఫూర్తితో నిరసన చేయాలనుకుంటే...కోళ్ల పందేలు.. పందుల పందేలు ఆడుకోవచ్చని ఆందోళనకారులను ఆయన కోరారు. అంతేకాని ప్రత్యేక హాదా ఇక ముగిసన అధ్యాయమని మంత్రి సుజనా చెప్పేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చంద్రబాబు చూస్తూ ఉరుకోరని కూడా సుజనా తెలిపారు. రాష్ట్రానికి ఏం అన్యాయం జరిగిందో చెపితే...తాను సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
మరోవైపు రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఆందోళనకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక హోదా కోసం చేసే నిరసనలను అనుమతించేది లేదని స్పష్టం చేసిన గంటా...వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు కూడా హితవు చెప్పారు. వారిద్దరూ తమ నిర్ణయాలను, ఆలోచలను మార్చుకోవాలని గంటా కోరారు. విశాఖ మాత్రమే కాదు రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోరుతూ ఎక్కడ ఆందోళనలను జరిపినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇద్దరు మంత్రుల వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పు పడుతున్నారు. యువతను రెచ్చగొట్టేవిధంగా మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడకూడదని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మొత్తం మీద సుజనా, గంటా కామెంట్స్ తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.