ఆర్కే క్షేమం : వీడిన సస్పెన్స్

మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన రామకృష్ణ అలియాస్ ఆర్కే క్షేమంగానే ఉన్నారు. ఆయన ఎక్కడున్నారనే విషయంపై ఎన్కౌంటర్ జరిగిన నాటినుంచి కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ఆయన క్షేమంగానే ఉన్నట్లుగా వరవరరావు ప్రకటన చేశారు. ఈ మేరకు తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. ఆర్కే గురించి అసలు ఈ పది రోజులుగా ఏ సంగతీ తెలియకపోవడంతో.. ఆయన భార్య ఆచూకీ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి కూడా తెలిసిందే.
కోర్టు విచారణలో పోలీసులు ఆర్కే అసలు తాము ఎన్ కౌంటర్ జరిపిన ప్రాంతంలో ఉన్నట్లుగా కూడా తమకు సమాచారం లేదని, ఆయన తమ అదుపులో లేడని, తమ అదుపులో ఉంటే కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి తమకు అభ్యంతరం ఏమీ లేదని పదేపదే ప్రకటించారు. కోర్టుకు ఇచ్చిన కౌంటర్ లో కూడా అదే పేర్కొన్నారు. అయితే పోలీసుల మాటలను ప్రజాసంఘాలు మాత్రం విశ్వాసంలోకి తీసుకోలేదు. ఆర్కేను పోలీసులు నిర్బంధించి.. కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారంటూ ఆరోపిస్తూ వచ్చారు.
విస్తృతమైన నెట్ వర్క్ ఉన్న నేపథ్యంలో ఆర్కే తప్పించుకుని ఉంటే ఎవరో ఒకరికి సమాచారం వచ్చి ఉంటుంది కదా? రాలేదంటే.. పోలీసుల అదుపులో ఉన్నట్లే అంటూ ప్రజాసంఘాలు వాదించాయి. తాజాగా వరవరరావు ప్రకటనతో.. పోలీసుల మీద ప్రజాసంఘాలు చేసిన ఆరోపణలు పెంచుకున్న అనుమానాలు అన్నీ ఉత్తివే అని తేలిపోయింది.
ఆర్కే కోసం వేధిస్తున్నారట
మరోవైపు ఆర్కే ఆచూకీ తమకు తెలియజేయాల్సిందిగా కోరుతూ పోలీసులు గిరిజనుల్ని వేధిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ఆరోపించింది. గిరిజనుల మీద పోలీసు వేధింపులను తక్షణం ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఆర్కే కోసం మావోయిస్టులు కంగారు పడితే, ఇప్పుడు పోలీసులు కంగారు పడుతున్నట్లుంది.