అమ్మ... అశోక్ బాబు......ఇదా సంగతి?
ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నవ నిర్మాణ దీక్షల ముగింపు సందర్భంగా కాకినాడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రిపై అశోక్ బాబు పొగడ్తలతో ముంచెత్తారు. ఎప్పటికీ చంద్రబాబే సిఎంగా ఉండాలని అభిలాషించారు. చంద్రబాబు మీద అశోక్‌బాబుకు ఎందుకు అంత ప్రేమ పుట్టుకువచ్చిందా అని ఆరా తీస్తే జులై1 నుంచి జిఎస్టీ అమల్లోకి వస్తే ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా ఉండటం కుదరదట. పదోన్నతుల్లో భాగంగా అశోక్బాబుక గజిటెడ్ ఆఫీసర్ల క్యాటగిరీలోకి వెళ్లిపోతారు. దీంతో ఆయన భవిష్యత్తును వెదుక్కునే పనిలో పడ్డారని ఉద్యోగ సంఘాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిని కాకాపట్టి ఏదొక నామినేటెడ్ పదవో., గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలనో భావిస్తున్నారట. అందుకే నానా తిప్పలు పడుతున్నారట.
తొలినుంచి టీడీపీకి దగ్గరగా....
సమైక్యాంధ్ర ఉద్యమంలో అశోక్ బాబు ఉద్యోగ సంఘాల నేతగా ఉండి ముందుకు నడిపారు. తర్వాత అధికార తెలుగుదేశంపార్టీకి దగ్గరయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఏపీ ఎన్జీవో సంఘంలో లుకలుకలు బయలుదేరాయి. వేరు కుంపట్లు పెట్టుకునేందుకు సిద్ధమయిన నేపథ్యంలో అశోక్ బాబు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. అందుకోసమే ఆయన తొలినుంచి చంద్రబాబుకు దగ్గరయ్యారన్న ఆరోపణలూ లేకపోలేదు. ఈనేపథ్యంలో అశోక్ బాబును తెలంగాణలో మాదిరిగానే శ్రీనివాసగౌడ్, దేవీ ప్రసాద్ ల మాదిరిగా పదవులు ఇస్తారా? లేక పక్కన బెడతారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద అశోక్ బాబు వ్యవహారం ఏపీ ఎన్జీవోల్లో హాట్ టాపిక్ గా మారింది.
- Tags
- అశోక్ బాబు