అనుకున్నదే అయింది : ఆర్కే సంగతి తేలలేదు!

అనుకున్నట్ల్లే అయింది. మావోయిస్టు అగ్రనేత పోలీసుల నిర్బంధంలో ఉన్నారా అనే సంగతి హైకోర్టులో ఆయన భార్య వేసిన పిటిషన్ ద్వారా తేలలేదు. తేలే అవకాశం కూడా అంత సులువుగా కనిపించడం లేదు. అసలు ఆర్కే తమ నిర్బంధంలో లేనే లేడని విశాఖ రూరల్ జిల్లా ఎస్పీ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ లో తేల్చేశారు. ఆర్కే ఆచూకీ తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్ ను హై కోరుట గురువారం విచారించింది.
పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, వారు ఆర్కే ను నిర్బంధంలోకి తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. అయితే ఆర్కే పోలీసుల నిర్బంధంలో ఉన్నట్లుగా మీ వద్ద ఆధారాలున్నాయా అంటూ కోర్టు పిటినర్లనే ఎదురు ప్రశ్నించడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఆధారాలుంటే చూపాలంటూ హైకోర్టు పిటిషనర్లను ఆదేశించింది. ఇందుకు వారు రెండు వారాల గడువు కావాలని అడగడం విశేషం. వారి కోరిక మేరకు కోర్టు తదుపరి విచారణను రెండువారాలు వాయిదా వేసింది.
ఆర్కే ఆచూకీ తెలియకపోవడం అనేది మావోయిస్టు వర్గాల్లో తీవ్ర సంచలనంగా తయారవుతోంది. గురువారం మావోయిస్టు పార్టీ బంద్ కు పిలుపు ఇచ్చింది. ఏవోబీ , సరిహద్దు మన్యం ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. మావోయిస్టులు గురువారమే ఎక్కడైనా ప్రతిదాడులకు పాల్పడవచ్చునని శంకిస్తున్నారు. అయితే విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ లో మాత్రం ఆర్కే తమ వద్ద లేరనడం మాత్రమే కాకుండా, ఎన్ కౌంటర్ జరిగిన సమయానికి ఆ ప్రాంతంలో ఆర్కే ఉన్నట్లుగా తమకు సమాచారం కూడా లేదని వెల్లడించారు. ఆర్కే మీద మొత్తం 40 కేసులు ఉన్నాయనే విషయాన్ని కూడా ఎస్పీ తన కౌంటర్ లో పేర్కొన్నారు.