అటు అమ్మ పూజలు.. ఇటు అయ్య పూజలు..

తమిళనాడు వాసులు అంటేనే అక్కడ ఆధ్యాత్మిక విశ్వాసాలు చాలా ఎక్కువ. సెంటిమెంట్లు ఎక్కువ. దేవుళ్ల మీద ఎంతగా మూఢభక్తికి మించిన స్థాయిలో భక్తి ఉంటుందో.. నాయకుల మీద అదే తీరుగా.. మూఢ ప్రేమను మించిన ప్రేమ ఉంటుంది. అలాంటి వాతావరణంలో.. ఇక రాష్ట్రమంతా పూజలతో హోరెత్తిపోవడంలో ఆశ్చర్యం ఏముంది?
తమిళనాడు ముఖ్యమంత్రి పురట్చితలైవి జయలలిత సుమారు నలభై రోజులుగా చెన్నయ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం కుదుట పడాలని, వెంటనే కోలుకోవాలని కోరుకుంటూ.. పెద్దసంఖ్యలో అమ్మ భక్తులు తమిళనాడు అంతటా పూజలు నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. జయలలిత ఆరోగ్యం కోసం అన్నా డీఎంకే పార్టీ కి చెందిన వారంతా.. పూజలు, మొక్కల చెల్లింపులు, యజ్ఞయాగాదులు చేసేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హటాత్తుగా ప్రతిపక్ష నేత ‘అయ్య’ కరుణానిధి కూడా అస్వస్థత పాలయ్యారు. ఆయన కూడా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు స్వల్ప అస్వస్థత మాత్రమే అని పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది గానీ.. నిజానికి అభిమానుల్లో మాత్రం ఆందోళన హెచ్చుతోంది. అటు ఆ పార్టీ వర్గీయులు కూడా ఇప్పుడు పూజలు పునస్కారాలు, యజ్ఞాలు మొదలు పెడుతున్నారు.
మొత్తానికి తమిళ సీమ మొత్తం.. పూజాదికాలతో హోరెత్తిపోతోంది.