అక్కడ జగన్ హోప్స్ అవేనట...!!!

కాంగ్రెస్ కు ఒకప్పుడు కంచుకోట అది. అలాగని టీడీపీకి అప్పుడప్పుడూ విజయాలు అందించిన ప్రాంతమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. అదే శ్రీకాకుళం జిల్లలోని పాతపట్నం నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ బలంగా లేదన్నది గతంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తేనే అర్థమవుతుంది. కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గంలో రాష్ట్ర విభజన తర్వాత ఆ ఓటు బ్యాంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కన్వర్ట్ అయిందనే చెప్పాలి. దీంతో గత ఎన్నికలలో ఇక్కడ వైసీపీయే గెలిచింది.
టీడీపీకి అంత పట్టులేని.....
పాతపట్నం నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది లక్ష్మీపార్వతి... శత్రుచర్ల విజయరామరాజు. 1996లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టిన లక్ష్మీపార్వతి ఇక్కడినుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడినుంచి గెలిచిన శత్రుచర్ల విజయరామరాజు తర్వాత మంత్రి అయ్యారు. 1956లో ఏర్పడిన పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆరుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీకి ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. ఇక స్వతంత్ర అభ్యర్థులకుకూడా ఈ నియోజకవర్గం రెండు సార్లు ఆదరించడం విశేషం.
వైసీపీ నుంచి గెలిచి...
గత ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొందిన కలమట వెంకటరమణ మూర్తి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శత్రుచర్ల విజయరామరాజు వైసీపీ అభ్యర్థి కలమట వెంకటరమణమూర్తిపై దాదాపు నాలుగువేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక స్థానాలను టీడీపీ కైవసం చేసుకున్నప్పటికీ పాతపట్నంలో మాత్రం జనం వైసీపీకే జైకొట్టడం విశేషం. అయితే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.
సిట్టింగ్ కు కష్టమేనట....
ఈ నేపథ్యంలో పాతపట్నంలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారడంతో ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే పనితీరు కూడా బాగా లేకపోవడం, వైఎస్ జగన్ పాదయాత్ర జరుగుతుండటం తమకు ప్లస్ అవుతుందని పాతపట్నం వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక్కడ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ వస్తుందో? లేదో? కూడా తెలియని పరిస్థితి టీడీపీలో ఉంది. మరోసారి శత్రుచర్ల విజయరామరాజును బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాతపట్నాన్ని మరోసారి కైవసం చేసుకోవాలనుకుంటున్న జగన్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- kalamata venkataramana
- nara chandrababu naidu
- pathapatnam constiuency
- pawan kalyan
- sathrucharla vijayaramaraju
- srikakulam district
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కలమట వెంకటరమణ
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- పాతపట్నం నియోజకవర్గం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- శత్రుచర్ల విజయరామరాజు
- శ్రీకాకుళం జిల్లా