వైసీపీలో ఆ ఇద్దరి దారెటు...!

ఏపీ ప్రధాన విపక్షం వైసీపీలో ఇద్దరు కీలక నాయకులు ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారు. వారు నాటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు గా చక్రం తిప్పారు. వారి సొంత జిల్లాలను అయితే ఏకంగా కనుసైగలతోనే శాసించారు. కాంగ్రెస్ హయాంలో వారి వారి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హవా సాగించారు. అయితే, రాష్ట్ర విభజననేపథ్యంలో వారు వైసీపీలో చేరిపోయారు. అయితే, మొదట్లో వారికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని జగన్ చాలా తగ్గించేశారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారట. ఈ క్రమంలోనే ఎటు నడవాలి? ఏ దారి పట్టాలి? అని తెగ ఆలోచిస్తున్నారు. వారిద్దరు ఎవరు? అనే ప్రశ్నకు ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు నాయకులుబొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుల పేర్లు వినిపిస్తున్నాయి.
రెండు సీట్లు మాత్రమే....
వీరిద్దరూ కూడా రాష్ట్రంలో కీలకమైన మంత్రిపదవులు అనుభవించిన వారే. ఇక, బొత్స అయితే, రాష్ట్ర కాంగ్రెస్‌కు ఛీప్‌గా కూడా ఉన్నారు, అయితే, ఇప్పుడు ఆయన పరిస్థితి నలుగురుని కలుపుకొని వెళ్లినా తప్పే.. నలుగురిలో ఉండకపోయినా తప్పే అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుతం శ్రీకాకుళంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ఇటీవల టికెట్లపై చర్చించారు. ఈ చర్చకు కీలకమైన బొత్సకు ఆహ్వానం అందలేదు. పైగా ఆయన కోరుతున్న విధంగా బొత్స ఝాన్సీకి సీటు ఇచ్చేందుకు జగన్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఇంట్లో రెండు టికెట్లు ఇచ్చేది లేదు. అని జగన్ ఖరాఖండీగా చెబుతున్నాడు. బొత్స లెక్క వేరుగా ఉంది. తనకు చీపురుపల్లి, తన సోదరుడు అప్పల నరసయ్యకు గజపతినగరం, తన భార్య ఝాన్సీకి విజయనగరం ఎంపీ సీటు, తన మేనల్లుడు మజ్జి శ్రీను (చిన్న శ్రీను)కు నెల్లిమర్ల సీట్లు కావాలని అడుగుతున్నాడు. అయితే జగన్ మాత్రం రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో బొత్స ఏమి చేయాలో తెలియక తలపట్టుకున్నారట.
అందుకే తగ్గారట....
దీంతో బొత్స పరిస్థితి అగమ్యంగా మారింది. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లిపోవాలని కూడా బొత్స అనుకు న్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి రఘువీరారెడ్డి కూడా నిజమేనని సీనియర్లు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల్లో భాగంగా టీడీపీతో కాంగ్రెస్ పొత్తుకు రెడీ అయింది. దీంతో బొత్స వెనక్కితగ్గారు, ఆయనకు వైసీపీలో ప్రాధాన్యం నానాటికీ తగ్గిపోయింది. జిల్లాలో రెండు సీట్లు ఇచ్చి మజ్జి శ్రీనుకు అవసరమైతే భీమిలిలో గంటాపై పోటీ చేయిద్దామన్న ఆలోచన కూడా జగన్ మదిలో ఉందట. అంటే మజ్జి శ్రీను విజయనగరం కాదని పక్కనే ఉన్న విశాఖ జిల్లాకు మారాల్సి ఉంటుంది.
ధర్మాన పరిస్థితి ఇదీ.....
ఇక, ధర్మాన పరిస్తితి మరోవిధంగా ఉంది. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా శ్రీకాకుళం ఎంపీ సీటు ఇచ్చి వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసీపీని గెలిపించే బాధ్యతను అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అక్కడ ఎంపీగా బలంగా ఉన్న కింజరాపు రామ్మోహన్నాయుడును ఢీకొట్టాలంటే మీరు ఎంపీగానే పోటీ చేయాలని జగన్ ధర్మానపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక, నేను పార్టీలో ఉండి ఏం లాభం అనుకుంటున్నారట. మరి ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు బయటకు వస్తే.. ఏపార్టీలో చేరేందుకు అవకాశం లేదు. పోనీ.. అక్కడే ఉంటే అసలు ప్రాధాన్యమే లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట.
- Tags
- andhra pradesh
- ap politics
- bostha satyanarayana
- dharmana prasadarao
- indian national congress
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- ధార్మాన ప్రసాదరావు
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- బొత్స సత్యనారాయణ
- భారత జాతీయ కాంగ్రెస్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ