ఎవరికి వారే...యుద్ధానికి రెడీ...!

రాబోయే ఎన్నికల కోసం సర్వసన్నద్ధం అవుతున్నాయి అన్ని పార్టీలు. ఎప్పటినుంచో ఊరిస్తూ ఉంచిన నామినేటెడ్ పదవులను భర్తీ చేసి టిడిపి క్యాడర్ లో జోష్ పెంచింది. ఇక వైసిపి ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలోని క్యాడర్ కు జగన్ పాదయాత్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది. పాదయాత్రకు చేయాలిసిన ఏర్పాట్లను అప్పగించి వారికి క్షణం తీరికలేని పని అప్పగించింది. ఈ రెండు ప్రధాన పార్టీలు ఆ విధంగా ముందుకు పోతుంటే జనసేన పార్టీ విస్తరణ కమిటీల నియామకంలో బిజీ అయ్యింది. సంస్థాగత బలోపేతం అభ్యర్థుల వేటలో పవన్ పార్టీ స్పీడ్ పెంచింది.
పదవుల పంపిణీతో ...
ద్వీతీయ శ్రేణి నాయకులు ఏ పార్టీకైనా కీలకం. అది గుర్తించే ఎప్పటినుంచో పక్కన పెట్టిన నామినేటెడ్ పదవులను పంచి పెట్టేస్తుంది టిడిపి. దీనివల్ల క్యాడర్ ఎన్నికలకు బాగా సమాయత్తం అవుతుంది. అదే సమయంలో పార్టీని నమ్ముకుని కష్టపడ్డ కొందరికి పదవులు దక్కకపోవడంతో నిరాశలో మునిగితేలుతున్నారు కొందరు తమ్ముళ్లు. తమకు న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పక్కపార్టీలోకి దూకేయడం బెటరని కొందరు అసంతృప్తులు సిద్ధమైపోతున్నారు. వారిని బుజ్జగించే పని మొదలెట్టారు సీనియర్ నేతలు.
పాదయాత్ర తో వణుకుతున్న కోఆర్డినేటర్ లు ...
జగన్ పాదయాత్ర ను విజయవంతం చేయడంపైనే వైసిపి లో వచ్చే ఎన్నికల్లో టికెట్ల ఖారారు 90 శాతం ఆధారపడి ఉంటుంది. వైసిపి కో ఆర్డినేటర్ లు గా ఆయా నియోజక వర్గాల్లో నియమితులైన వారంతా దాదాపు ఎమ్యెల్యే, ఎంపీలు గా ఆ పార్టీ టికెట్లు హామీ పొందిన వారే. వారి పెర్మాఫర్మెన్స్ కి ఇప్పుడు పరీక్ష జగన్ పాదయాత్ర. దాంతో పాదయాత్ర జరగాలిసిన ఐదు జిల్లాల్లో కో ఆర్డినేటర్ లకు రాబోయే రోజుల్లో అగ్నిపరీక్ష ఎదురుకానుంది. ఇప్పటికే రాష్ట్ర నాయకులు పాదయాత్ర కు సంబంధించిన ఏర్పాట్లు కార్యాచరణ కో ఆర్డినేటర్ల తో సమావేశమై జిల్లాల వారీగా అందించారు. ఈ నేపథ్యంలో అధినేత యాత్ర విజయవంతానికి జగన్ పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసేస్తున్నారు.
కమిటీలపై ఫోకస్ ...
జనసేన రాష్ట్రవ్యాప్త సేన సిద్ధం చేసేందుకు నడుం కట్టింది. గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయడంపై ఆ పార్టీ కసరత్తు దాదాపుగా పూర్తి అయ్యింది. ఫైనల్ గా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ తరువాత కమిటీల ప్రకటన మొదలు కావడమే ఆలస్యం. కమిటీల ఏర్పాటు అనంతరం జనంలో జనసేన దూసుకువెళ్లబోతుంది. కమిటీల ప్రకటన తరువాత అసంతృప్తులు ఎదురైతే బుజ్జగించే యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటుంది జనసేన. నియోజక వర్గాల వారీగా ఇప్పటికే డేటా రెడీ అయిపొయింది ఆ పార్టీలో. సో మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీల 2019 ఎన్నికల యుద్ధానికి పూర్తి స్థాయిలో సమాయత్తం అయినట్లే.