ఒకరి పై ఒకరు నిఘా... ఎందుకిలా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు భలే తమాషాగా తయారయ్యాయి. ఇప్పుడు బేజీపీ ప్రధాన శత్రువుగా మారడంతో ప్రధాన పక్షాలు ఒకరిపై ఒకరు నిఘాను పెట్టుకున్నాయి. తెలుగుదేశం, వైసీపీలు హస్తినలో ఏంచేస్తున్నాయన్నదానిపై సొంత నిఘాలను పెట్టినట్లుంది. అందుకే ఒకరి విషయాలు మరొకరు బయటపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయలేదంటూ ఏపీలోని అన్ని పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ, నరేంద్ర మోడీలను టార్గెట్ గా చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని దాదాపు అన్ని పక్షాలూ ప్రయత్నిస్తున్నాయి.
వైసీపీ బీజేపీతో......
ఈ దశలోనే బీజేపీతో దగ్గరవుతున్నారని ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసం ప్రధానమంత్రికి, బీజేపీకి దగ్గరవుతున్నారని టీడీపీ విమర్శలు చేస్తోంది. అందుకే ప్రధానమంత్రి కార్యాలయంలో నిత్యం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉంటున్నారని, ప్రధాని కార్యాలయం కూడా ఆయనకు ఎలా అపాయింట్ మెంట్ ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి కదలికలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ హస్తినలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఏడుగురు ఇంటలిజెన్స్ అధికారులు ఇదే పనిమీద ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇలా వైసీపీ కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ బీజేపీ, వైసీపీల సంబంధాలను ప్రజలకు చెప్పేందుకు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను టీడీపీ ఏర్పాటు చేసుకుంది.
మోడీని కలిసేందుకు టీడీపీ.....
మరోవైపు వైసీపీ కూడా అదే బాటలో ఉన్నట్లుంది. ఇటు హస్తినలోనూ, హైదరాబాద్ లోనూ ప్రత్యేక నిఘా వర్గాలను వైసీపీ ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబును ఐబీ చీఫ్ ఎందుకు కలిశారో చెప్పాలని వైసీపీ ప్రశ్నిస్తుంది. అలాగే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మోడీని కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా వైసీపీ బయటపెట్టింది. సుజనా చౌదరి, సీఎంరమేష్ లో ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఇటీవల ప్రయత్నించారన్నది ఆ పార్టీ ఆరోపణ. అలాగే సుజనాచౌదరి ఇటీవల గవర్నర్ తో రహస్యమంతనాలు జరిపిన విషయాన్ని కూడా వైసీపీ చెబుతోంది. ఇలా హస్తినలోనూ, హైదరాబాద్ లోనూ రెండు ప్రధాన పార్టీలు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒకరి విషయాలు మరొకరు తెలుసుకుని ప్రజలముందుంచుతున్నారు. బీజేపీ నేతలను కలిస్తే చాలు క్షణాల్లో తెలిసిపోయేలా పకడ్బందీ ఏర్పాట్లను ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు చేసుకున్నట్లుంది.