వట్టి మాటలు గట్టివేనా... పొలిటికల్ రీ ఎంట్రీ ఫిక్స్...!

ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే స్టేట్‌లో అధికారంలోకి వస్తుంది. ఈ నానుడి నిజం చేస్తూ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి పోటీ చేసిన గన్ని వీరాంజనేయులు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంతో పదేళ్ల అనుబంధం ఉన్న మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ పొలిటికల్ రీ ఎంట్రీపై ఇటీవల ఆయన తన అంతరంగీకుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ చర్చనీయాంశమయ్యాయి. దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వసంత్ 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి బయటపడ్డారు.
రెండోసారి గెలిచాక...
వసంత్ రెండోసారి గెలిచాక వైఎస్ కేబినెట్లో మంత్రి అయ్యారు. ఆయన మరణాంతరం రోశయ్య ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయినప్పుడు వసంత్ ప్రయారిటీ పూర్తిగా తగ్గించేశారు. వసంత్ పర్యాటకకు శాఖకు పరిమితం అయ్యారు. చివరి మూడేళ్లు ఆయన తన శాఖ పట్ల అయిష్టతతో నామమాత్రపు మంత్రిగానే కొనసాగారు. గత ఎన్నికలకు ముందు (రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌కు ఇక్కడ కాస్త పట్టున్నప్పుడు) ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేసే ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఇక్కడ నిర్వీర్యం కావడంతో వసంత్ రాజకీయాలకు దూరమయ్యారు.
2014లో గన్ని వర్సెస్ వాసుబాబు...
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు వైసీపీ నుంచి పుప్పాల వాసుబాబు పోటీ పడగా గన్ని 9 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నాలుగేళ్లుగా రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న వసంత్ ఇటీవల తన స్వగ్రామం అయిన పల్లపూరులో తన అనుంగు అనుచరులు, గతంలో తన వెన్నంటే ఉన్న ముఖ్య కార్యకర్తలను ఆహ్వానించి వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఉంగుటూరు నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పారు. జనసేన+ఉభయ కమ్యూనిస్టు పార్టీలు+కాంగ్రెస్ పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తాను ఇక్కడ నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పారని ఆయన సన్నిహితులు కూడా ధృవీకరించారు. వసంత్ ఇచ్చిన హింట్ ప్రకారం చూస్తే ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో జనసేన+కమ్యూనిస్టుల పొత్తు ఉంటుందని స్పష్టత వచ్చింది... మరి ఈ కూటమితో కాంగ్రెస్ ఎలా కలుస్తుంది ? అన్నది అర్థం కాలేదు. ఒకవేళ తాను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఇక్కడ జనసేన పోటీ లేకుండా ఆ పార్టీ మద్దతు కూడా తీసుకుంటాడా ? అన్నది క్లారిటీ లేదు.
2019లో ట్రయాంగిల్ ఫైట్ ఎలా ఉండబోతోంది....
వసంత్ వచ్చే ఎన్నికల్లో ఉంగుటూరు బరిలో ఉంటానని గంటాపథంగా చెప్పడంతో ఇక్కడ జనసేన, వైసీపీ క్యాండెట్లు కాపు వర్గానికి చెందిన వారుగా రంగంలో ఉంటే టీడీపీ నుంచి కమ్మ వర్గానికి చెందిన గన్ని పోటీలో ఉంటారు. ముక్కోణపు పోటీలో 48 వేల ఓట్లు ఉన్న కాపుల ఓట్లు, 36 వేల ఎస్సీ ఓటింగ్, బీసీ ఓటింగ్ అభ్యర్థుల గెలుపు ఓటములలో కీలకం కానున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని కాపుల కోసం ప్రత్యేకంగా చేసిన పనులతో కొంత ఫిక్స్డ్ కాపు ఓటింగ్ టీడీపీకే మొగ్గు చూపుతుంది. మిగిలిన కాపుల్లో వసంత్ పోటీలో ఉంటే మెజార్టీ ఓట్లు ఆయనకు, ఆ తర్వాత వైసీపీకి పడే ఛాన్స్ ఉంది. ఇక నియోజకవర్గంలోని బీసీల్లో టీడీపీకి మంచి పట్టు ఉండడంతో ఆ పార్టీకే బీసీల్లో మొగ్గు ఉంటుంది. ఇక ఎస్సీ ఓటింగ్ మూడు పార్టీల మధ్య హోరా హోరీగా చీలుతుంది. ఇక స్వల్పంగా ఉన్న కమ్మ వర్గం ఓట్లు ఎలాగూ టీడీపీకే ఉంటాయి.
వట్టి గట్టి పోటీ ఇస్తాడా...
ఇక నియోజకవర్గానికి ఐదేళ్ల పాటు పూర్తిగా దూరంగా ఉన్న వట్టి తన పొలిటికల్ రీ ఎంట్రీపై గట్టి మాటలే చెప్పారు. మరి ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాడా ? అన్నది చూడాలి. పదేళ్లు ఎమ్మెల్యేగా కంటే ఐదేళ్లు మంత్రిగా నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు చేశారు. నియోజకవర్గంలో అప్పటకీ ఇప్పటకీ పరిస్థితులు పూర్తిగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ అయ్యారు. మరో వైపు వైసీపీ నుంచి తన కమ్యూనిటీకే చెందిన పుప్పాల వాసు రేసులో ఉండడంతో అటు కూడా గట్టి పోటీ ఉంటుంది. మరి వసంత్ ఈ ట్రయాంగిల్ ఫైట్‌లో స్ట్రాంగ్‌గా నిలబడతాడా ? లేదా ? అన్నది చూడాలి.
- Tags
- andhra pradesh
- ap politics
- ganni veeranjaneyulu
- indian national congress
- jansena
- left parties
- nara chandrabaabu naidu
- telugudesam party
- vasu babu
- vatti vasantha kumar
- vunguturu
- ys jaganmohan reddy
- ysrcp
- ఆంధ్రప్రదేశ్
- ఉంగుటూరు
- ఏపీ పాలిటిక్స్
- గన్ని వీరాంజనేయులు
- జనసేన
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- వట్టి వసంతకుమార్
- వామపక్షాలు
- వాసుబాబు
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి
- వైసీపీ