సై‘‘కిల్’’ చేస్తున్న సింహపురి లీడర్లు
ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఆయన పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడంతోపాటు .. ప్రస్తుతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని నేతలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యేక హోదా విషయాన్ని నెత్తికెత్తుకున్నారు. అదే సమయంలో సెంటిమెంట్ పండుతుందనే ఉద్దేశంతో తన పుట్టిన రోజునాడు అంటే ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పోరాట దీక్ష పేరుతో పెద్ద ఎత్తున దీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని తమ్ముళ్లకు పిలుపు నిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నేతలు సైకిళ్లు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు.
ఇక్కడ అమలుకాలేదేంటి?
అయితే, కీలక జిల్లా నెల్లూరులో మాత్రం తమ్ముళ్లు చొరవ చూపలేదు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జిల్లాలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించారు. ఈ షెడ్యూల్ నెల్లూరు జిల్లాలో ఎక్కడా అమలు కాకపోవటం పార్టీ పరిస్థితికి నిదర్శనం. జిల్లాలో యాత్రలు సరిగా జరగకపోతే మరో వారం రోజులు పొడిగించాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్న నేతలకు స్థానిక పరిస్థితులు కత్తిమీద సాములా మారాయి. మరోవైపు కొందరు ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు అయితే అసలు ఈ యాత్రల గోల ఏంటని నియోజకవర్గాలకే పూర్తిగా దూరంగా ఉంటున్నారు. టీడీపీ నేతల్లో ప్రజల వ్యతిరేకత భయం వెంటాడుతోంది.
మొక్కుబడిగా కొందరు....
నాలుగేళ్లుగా ఏమీ చేయకుండా బీజేపీతో దోస్తీ కట్టి ఇప్పుడు తప్పు అంతా బీజేపీపై రుద్ది ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొందాలన్నదే సైకిల్ యాత్ర అంతిమ లక్ష్యం. ప్రజల్లోకి వెళితే వారు ప్రశ్నిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. వారికి ఏం చెప్పాలి.. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కొందరు నాయకులు ఈ యాత్రలు మనకొద్దని నిర్ణయించినట్లు సమాచారం. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో గత వారం రోజుల్లో సైకిల్ యాత్రలు మొక్కుబడిగా జరగ్గా, మిగిలిన మూడు నియోజకవర్గాలైన ఆత్మకూరు, సూళ్లూరుపేట, కావలిలో అసలు ప్రారంభం కాని పరిస్థితి. బిజీ షెడ్యూల్ తర్వాత మంత్రి సోమిరెడ్డి పొదలకూరులో సైకిల్‌యాత్ర నిర్వహించారు.
ఎవరికి వారే.....
వెంకటగిరిలో కార్యకర్తలే సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. కనీసం ఒక్కచోట కూడా ఎమ్మెల్యే కురుగుండ్ల పాల్గొన్న దాఖాలాల్లేవు. నెల్లూరులో సిటీ ఇన్చార్జి శ్రీధరకృష్ణారెడ్డితో పాటు మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఆయన సోదరుడు వివేకానందరెడ్డి మరణంతో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. కావలి ఇన్చార్జిగా ఉన్న బీద మస్తానరావు వ్యాపారాల పనిమీద విదేశాల్లో బిజీగా ఉండి ఇటీవలే స్వదేశానికి వచ్చారు. సూళ్లూరుపేట ఇన్చార్జి పరసా రత్నం ఇంతవరకు యాత్ర ఆలోచనే చేయలేదు. దీంతో నెల్లూరులో సైకిల్ ర్యాలీ చేసే వారే కరువయ్యారని ఇప్పటికే చంద్రబాబుకు నివేదికలు కూడా అందాయి. మరి దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.