దంచి కొడితే సరిపోతుందా...!!!
రాజకీయాల్లో ప్రత్యర్థులపై యుద్ధం చేయాల్సిందే. దంచికొట్టే వ్యాఖ్యలను సంధించాల్సిందే. అయితే, ఇవే ఎల్లకాలం పని చేస్తాయా? ఈ మసాలా మాటలే పార్టీకి ఊతమిస్తాయా? ఓట్లేయిస్తాయా? అదే నిజమైతే.. పార్టీలను సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం ఎందుకు? ఏ పార్టీ నాయకుడు ఆ పార్టీకి మద్దతుగాను, ప్రత్యర్థి పార్టీలపై దుమ్మెత్తి పోయడంలోను ముందుంటే.. చాలు కదా?! అయితే, రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు. జెండా మోసేవాడు, జై కొట్టేవాడు లేకపోతే.. నాయకుడు అన్న మాటలకు కూడా గుర్తింపు లేకుండా పోతుంది. మరి ఈ విషయాన్ని మార్పు కోసం ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ గుర్తించలేనట్టున్నారు. ఆయన నోరు విప్పితే.. ఏవేవో విమర్శలు తప్ప ఏమీ ఎవరికీ అర్ధం కావడం లేదు.
క్యాడర్ లేకుండా....
ఇక, ఆయన చేతులు తిప్పతే.. గాలిలోకి పిడిగుద్దులు తప్పితే ఇక్కడా ఏమీ అర్ధం కావడం లేదు. రాజకీయాల్లో ఉన్నవారు, ముఖ్యంగా మార్పు కోసం పార్టీ పెట్టిన నాయకుడు, కుల మత రహిత సమాజం కోసం పాటుపడతానని చెప్పిన నాయకుడు సొంత కేడర్ లేకుండా ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు మాటలు చెప్పుకొని ముందుకు వెళ్తారు? ప్రత్యర్థులపై విమర్శ లు చేయాల్సిన సమయంలోనే చేయాలి. కానీ, ప్రతి సారీ తన పార్టీకి ఓటు వేయడం ద్వారా ప్రజలకు జరిగే మేలును పవన్ చెప్పుకురావాలి. కానీ, ఇది సాధ్యం కానప్పుడు.. రేపు ప్రజలు కూడాతమకు ఓటు వేయడం సాధ్యం కాదని వెల్లడించారంటే.. ఏంటి పరిస్థితి!
ప్రత్యర్థులు కాబట్టే....
పవన్ తన ప్రసంగాల్లో ఇటీవల కాలంలో జగన్‌ను, బాబును తీవ్రంగా విమర్శిస్తున్నాడు. నిజమే పవన్‌కు వారిద్దరే ప్రత్యర్థులు కాబట్టి.. ఇలానే వ్యాఖ్యలు చేయాలి. కానీ, పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందికదా? ఇప్పటి వరకు కీలకమైన నియోజకవర్గం సమన్వయ కర్తలనే నియమించలేదు. అసలు ఇప్పటి వరకూ క్షేత్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పార్టీకి బలం ఏమీ లేదు. అసలు నిర్మాణం లేదు. ఏదో ఒక కులం వారు పవన్ ను వీర స్థాయిలో అభిమానిస్తూ ఉండవచ్చు.
సెంటిమెంట్ సరిపోతుందా?
మరి ఆ కులం ఓట్లతో పవన్ కళ్యాణ్ గెలవడం మాట అటుంచి.. కనీసం డిపాజిట్ కూడా పొందలేడు. ఎంత చిన్నా చితకా పార్టీ అయినా.. కింది స్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఈ మాత్రం తెలివి కూడా లేని పవన్ రాజకీయాలలో కీలకమైన సీఎం పోస్టును ఆశించడం, తాను కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకురావడం వంటివి సెంటిమెంట్ అస్త్రాలే అయినా.. కేడర్ లేనప్పుడు, ప్రచారానికి పది మంది కూడా ముందుకు రానప్పుడు ఆ ఆవేశ పూరిత ప్రసంగాలు, మసాలా మాటలు ఏమేరకు పవన్‌కు లబ్ధి చేకూరుస్తాయో ఆయనే చెప్పాలి.